తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా రాష్ట్రాల్లో పౌర చట్టం అమలు చేయం' - 42 Jamia students detained briefly during anti-CAB protest

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్నాయి. చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపించారు. తమ రాష్ట్రాల్లో అమలుచేయబోమని ఉద్ఘాటించారు. అయితే చట్టాన్ని తిరస్కరించే అధికారాలు రాష్ట్రాలకు లేవని హోంశాఖ అధికారి స్పష్టం చేశారు. ఈశాన్యంలో చెలరేగుతున్న నిరసనల కారణంగా జపాన్​ ప్రధాని షింజో అబె భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

42 Jamia students detained briefly during anti-CAB protest
మా రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టం అమలు చేయడం కుదరదు

By

Published : Dec 14, 2019, 5:46 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్ సీఎంలు తాజాగా నిరసన గళం వినిపించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని... దాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్​లో భాగమైన కేంద్ర జాబితాలో ఆ చట్టం ఉంటుందని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యంగ బద్దతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

రెండో స్వాతంత్య్ర సమరమిది: మమత

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర సమరంగా బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోనని ఉద్ఘాటించారు. "మతప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం ఎందుకు? నేను దీన్ని అంగీకరించను" అని ఆమె పేర్కొన్నారు.

లౌకికత్వంపై దాడి: అమరీందర్

పౌరసత్వ సవరణ చట్టాన్ని భారత లౌకికత్వంపై దాడిగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాధ్, ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తమ నిరసనను తెలిపారు.

సరకుల కోసం బారులు

ఘర్షణలతో గురువారం అట్టుడికిన అసోంలో పరిస్థితులు శుక్రవారం కాస్త మెరుగయ్యాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నా... హింస చెలరేగలేదు. గువాహటిలో ఉదయం కర్ఫ్యూను సడలించారంటూ స్థానిక ఛానెళ్లలో వార్తలు రావడంతో ప్రజలు నిత్యావసర సరకుల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. అయితే గువాహటిలో కర్ఫ్యూ సడలించలేదని అధికారులు స్పష్టం చేశారు. దిబ్రూగఢ్​తో పాటు మేఘాలయాలోని షిల్లాంగ్​లో మాత్రం కర్ఫ్యూను సడలించారు.

రైల్వేస్టేషన్లలో విధ్వంసం

పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ్​ బంగ​లో నిరసనలు వెల్లువెత్తాయి. ముర్షీదాబాద్ జిల్లా బెల్డాంగా రైల్వేస్టేషన్​లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఒక్కసారిగా వేలమంది దూసుకొచ్చి రైల్వేస్టేషన్​కు నిప్పుపెట్టారు. రైల్వే పరిరక్షక దళ సిబ్బందిని చితకబాదారు. హవ్​డా జిల్లాలోని ఉలుబెరియా రైల్వేస్టేషన్​లో ఆందోళనకారులు రైళ్లపై రాళ్లు విసిరారు. డ్రైవర్​ను గాయపర్చారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.

'జామియా మిలియా'లో లాఠీ చార్జి

దిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు భారీయెత్తున నిరసన చేపట్టారు. పార్లమెంట్ హౌజ్​వైపు దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జీ చేశారు. ఈ ఘర్షణలో 100 మందికిపైగా విద్యార్థులు, 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 42 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అరుణాచల్​ప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​లో నిరసనలు చోటు చేసుకున్నాయి.

అబె, షా పర్యటనలు రద్దు

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో జపాన్​ ప్రధానమంత్రి షింజో అబె భారత పర్యటన రద్దైంది. అబె, ప్రధాని మోదీ మధ్య వార్షిక సదస్సు గువాహటిలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగాల్సి ఉంది. మేఘాలయ, అరుణాచల్​ ప్రదేశ్​ల్లో ఆది, సోమ వారాల్లో జరగాల్సిన తన పర్యటనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు.

ఇదీ చూడండి: ముగిసిన సమావేశాలు... పార్లమెంట్​ అద్భుత పనితీరు

ABOUT THE AUTHOR

...view details