అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గణాంకాల ప్రకారం గత ఆరు దశాబ్దాలుగా చంద్రున్ని చేరుకోవడానికి వివిధ దేశాలు చేసిన మొత్తం ప్రయత్నాల్లో 60 శాతం మాత్రమే విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు చేపట్టిన 109 ప్రయోగాలలో 61 సార్లే విజయం దక్కింది. 48 సార్లు ఓటమి వెక్కిరించింది. 1958 ఆగస్టు నుంచి 1959 నవంబర్ మధ్య అమెరికా, సోవియట్ యూనియన్‌లు చంద్రునిపైకి 14 మిషన్లను ప్రయోగించాయి. ఇందులో కేవలం రష్యా ప్రయోగించిన లూనా-1, లూనా-2, లూనా-3 మాత్రమే విజయం సాధించాయి. చంద్రున్ని చేరుకోవడం అంత సులభంకాదనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రెండు పద్ధతులు..
చంద్రునిపై దిగడానికి రెండు పద్ధతులు ఉంటాయి. అంతరిక్ష నౌక నేరుగా చంద్రున్ని ఢీ కొట్టడం ఒక విధానం. 1959లో సోవియట్ యూనియన్ తొలిసారి లూనా-2ను చంద్రునిపై దింపింది. ఈ మిషన్‌ను ఇంపాక్టర్ అంటారు. ఇక రెండోది సాఫ్ట్ ల్యాండింగ్. దీనిలో అంతరిక్ష నౌక పూర్తి నియంత్రణతో చంద్రునిపై దిగుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం ఈ కోవకే చెందుతుంది. చంద్రునిపైకి తొలి మానవ పరికరాన్ని పంపిన సోవియట్ యూనియన్.. అదే ఉత్సాహంతో సాఫ్ట్ ల్యాండింగ్‌కు 1963 జనవరిలో లూనా-ఈ6 తో ప్రయత్నాలను ప్రారంభించింది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. అప్పటికే అంతరిక్ష ప్రయోగాలలో అమెరికాతో పోటీ పడుతున్న యూఎస్ఎస్ఆర్కు ఇది భావోద్వేగంతో కూడిన అంశంగా మారింది. ఆ తర్వాత జాబిల్లిపైకి వరుస ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 11 ప్రయోగాలు విఫలమయ్యాయి. వీటిలో ఐదుసార్లు విజయం అంచులవరకు వచ్చి బోల్తాపడింది. ఎట్టకేలకు 1966 జనవరి 31న లూనా-9 రూపంలో యూఎస్ఎస్ఆర్ 12వ యత్నంలో విజయం సాధించింది. ఆ తర్వాత కూడా చాలా ల్యాండర్ ప్రయోగాలు విఫలమయ్యాయి. చంద్రునిపైకి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మొత్తం 47 ప్రయోగాలు జరగ్గా......వాటిల్లో 27 మాత్రమే విజయవంతమయ్యాయంటే..... చంద్రునిపై దిగడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
భారత్ పరిస్థితి మెరుగు..
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగనే చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందున్న ఇజ్రాయిల్ కూడా సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో విఫలం అయింది. గతేడాది ఫిబ్రవరిలో బేర్‌షీట్ పేరుతో చంద్రుని పైకి ప్రయోగాన్ని చేపట్టి విఫలమైంది. దీనిని స్పేస్ ఎక్స్‌కు చెందిన నౌక అంతరిక్షంలోకి చేర్చింది. బేర్‌షీట్ కోసం బ్రిటన్ ఇజ్రాయిల్‌కు సాయం చేసింది. కానీ భారత్ తన సొంత వాహక నౌక అయిన జీఎస్‌ఎల్వీ ద్వారానే చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపించింది. ఈ రకంగా చూసుకుంటే భారత్ చాలా మెరుగైన స్థితిలోనే ఉందని చెప్పాలి. అందుకే చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.