'అయోధ్య' అనగానే దశాబ్దాలుగా సాగిన రామమందిరం, బాబ్రీ మసీదు భూవివాదమే గుర్తొస్తుంది. ఈ కారణంతో అక్కడ హిందూ ముస్లింలకు విభేదాలు ఉన్నాయని ఊహించుకుంటారు చాలా మంది. అలాంటి వారి అనుమానాలన్నీ పటాపంచలు చేస్తున్నారు రాంనగరి వాసులు. ఎన్నో ఏళ్లుగా పూజారులకు 'ఖడావ్' (పావుకోళ్లు)లు తయారు చేస్తూ సోదరభావాన్ని చాటుతున్నారు.
స్వచ్ఛమైన మనసుతో..
ఈ చెక్క పాదరక్షల వ్యాపారంలో పెద్దగా లాభాలు లేకపోయినా వారి వృత్తిని వీడలేదు ముస్లింలు. 'హిందువులకు మేం చెప్పులు తయారు చేయడమేంటని?' వారు ఏనాడూ అనుకోలేదు. హిందవులూ.. 'ముసల్మాన్లు తయారు చేసిన పాదరక్షలు మేమెలా తాకుతాం?' అని భావించలేదు. మసీదులో నమాజ్ చదివి వచ్చి, స్వచ్ఛమైన మనసుతో ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు వీరు.
20-22 రూపాయలు వెచ్చించి తయారు చేసే ఈ పాదరక్షలను కేవలం 25-30 రూపాయలకే విక్రయిస్తూ అతి తక్కువ లాభాన్ని పొందుతున్నారు ముస్లింలు. నగరంలోని దాదాపు 8 వేల ఆలయాల్లో పూజలు చేస్తోన్న అర్చకులకు ఇక్కడ నుంచే ఈ ఖడావ్ (పావుకోళ్లు) సరఫరా అవుతాయి.