దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరులో కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే వాదన ఉంది. ముఖ్యంగా విస్తృతస్థాయిలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా దీనిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు. తగినన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపకుండానే కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చనే ఆలోచనలో కొన్ని రాష్ట్రాలు, పట్టణాలు ఉన్నాయని.. అయితే అది అసాధ్యమని స్పష్టంచేశారు. 3టీ వ్యూహం(టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్‌మెంట్)తో ముందుకెళ్తున్న కేరళ, కర్ణాటక, దక్షిణ కొరియా ఇదే విషయాన్ని తెలియచెబుతున్నాయని గుర్తుచేశారు. అక్కడి ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, కచ్చితంగా మాస్కులు ధరించడం వల్లే వైరస్‌ను కట్టడి చేయగలుగుతున్నాయని తెలిపారు అమితాబ్.
3టీ వ్యూహంతో బెంగళూరు ముందుకు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో కర్ణాటకలో వైరస్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6824 పాజిటివ్ కేసులు బయటపడగా 81మంది మృత్యువాతపడ్డారు. ఇక మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరులో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు నగరంలో 648కేసులు మాత్రమే నమోదుకాగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇప్పటివరకు 464మంది కోలుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, సాంకేతికకు కేంద్ర బిందువైన కర్ణాటక కరోనా వైరస్ కట్టడికి 3టీ వ్యూహాన్ని కచ్చితంగా అమలుచేస్తూ ముందుకెళ్తోంది. దీనికి తోడు నాలుగో 'టీ'గా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.
ట్రేసింగ్..
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ‘ట్రేసింగ్’ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగా విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్న ప్రతి అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించారు. అంతేకాకుండా వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో కలిపి దాదాపు లక్షా నలభై వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.