తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2020, 9:00 AM IST

ETV Bharat / bharat

విదేశాల్లోనూ వేల మంది భారతీయులకు కరోనా!

కరోనా మహమ్మారి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారతీయులపై దాడికి దిగింది. ఇప్పటికే 53 దేశాల్లో నివసిస్తున్న, చిక్కున్న 3,336 మందికి కరోనా వైరస్​ సోకినట్లు తేలింది. అందులో 25 మంది ప్రాణాలు బలిగొంది ఈ వైరస్​. మరో వైపు లాక్​డౌన్​ వల్ల భారత్‌లో చిక్కుకుపోయిన 41 మంది పాకిస్థానీయులు స్వదేశానికి చేరుకున్నారు.

3,336 indians suffering in 53 other countries with covid-19
విదేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా

ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో 3,336 మందికి కరోనా సోకిందని.. అందులో 25 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోనూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేసింది భారత ప్రభుత్వం. పరిస్థితులు చక్కబడే వరకు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులంతా సంయమనం పాటించాలని కోరింది.

మరోవైపు కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ లేకపోవడం వల్ల ప్రస్తుతం చాలా వరకు మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌నే ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఎక్కువగా తయారవుతున్న ఈ ఔషధానికి గిరాకీ ఏర్పడింది. అందువల్ల వ్యాపార ఒప్పందాలు, గ్రాంట్ల ప్రాతిపదికన 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా కరోనా వైరస్‌ నిర్ధరణ కోసం ఉపయోగించే టెస్టింగ్‌ కిట్లను భారీ సంఖ్యలో.. సౌత్‌ కొరియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపాయి.

స్వదేశానికి 41 మంది పాకిస్థానీయులు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన 41 మంది పాకిస్థానీయులు స్వదేశానికి చేరుకున్నారు. అధికారుల సమక్షంలో గురువారం వారు వాఘా- అటారీ క్రాసింగ్‌ వద్ద పాక్‌లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా భారత్‌ తన సరిహద్దులను మూసివేసింది. వైద్యం, ఇతరత్రా పనులపై ఇండియాకి వచ్చిన వీరంతా.. లాక్‌డౌన్‌ కారణంగా ఆగ్రా, హరియాణా, పంజాబ్‌, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఉండిపోయారు. వారిని వీలైనంత త్వరగా రప్పించేందుకు భారత ప్రభుత్వం, సదరు వ్యక్తుల కుటుంబాలతో పాక్‌ హైకమిషన్‌ సమన్వయం చేసుకుంది.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పర్యవేక్షణలో, విదేశాంగ కార్యాలయం మార్గదర్శకత్వంలో పొరుగు దేశంలో చిక్కుకున్న పాకిస్థానీయులను సురక్షితంగా, సజావుగా తిరిగి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇచ్చామని హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా జాతీయులను వారివారి దేశాలకు తరలించేలా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చర్యలు చేపడుతోంది.

ఇదీ చదవండి:ఆ కరోనా మృతులంతా భోపాల్ దుర్ఘటన బాధితులే

ABOUT THE AUTHOR

...view details