బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 31 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం 1,195 మందిలో 371 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. అందులో 282 (24 శాతం) మందిపై నాన్ బెయిలెబుల్, ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్ర నేరారోపణలు గల కేసులు ఉన్నట్లు వెల్లడించింది ఏడీఆర్.
ప్రధాన పార్టీల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల వివరాలు..
పార్టీ | క్రిమినల్ కేసులు | తీవ్ర నేరారోపణలు |
భాజపా | 34 | 22 |
ఆర్జేడీ | 32 | 22 |
జేడీయూ | 21 | 11 |
కాంగ్రెస్ | 19 | 14 |
ఎల్జేపీ | 18 | 11 |
బీఎస్పీ | 5 | 4 |
లైంగిక వేధింపుల కేసుల్లో..
37 మందిపై లైంగిక వేధింపుల కేసులు ఉండగా.. ఐదుగురిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 20 మందిపై హత్య, 73 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
మూడోదఫా ఎన్నికలు జరుగుతున్న మొత్తం స్థానాల్లో 72 నియోజకవర్గాలు రెడ్ అలర్ట్ కింద ఉన్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు పోటీలో నిలిచిన నియోజకవర్గాలను రెడ్ అలర్ట్గా పేర్కొంటారు.