కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశంలో విధించిన 21రోజుల లాక్డౌన్ సత్ఫలితాలిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం చేదు అనుభవాలను మిగులుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, కాన్పూర్‌లో మరొకటి జరిగింది.
తల్లి అంత్యక్రియల కోసం 1100 కిలోమీటర్లు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్కు చెందిన సంతోష్ యాదవ్ అనే 30 ఏళ్ల యువకుడు ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపుర్ జిల్లాలో పనిచేస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్న ఈ జవానుకు.. ఈ నెల 4న తన తల్లి మరణించిందనే వార్త తెలిసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫలితంగా బిజాపుర్ నుంచి స్వస్థలం మీర్జాపుర్కు కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దాదాపు 1100 కి.మీ దూరం ఉన్న స్వస్థలానికి బయలుదేరిన అతడికి... దారిలో అక్కడక్కడ వాహనాదారులు లిఫ్ట్ ఇచ్చారు. అంతేకాకుండా ఎడ్ల బండి, వ్యాన్ ఆ తర్వాత ఎనిమిది గూడ్స్ రైళ్లు మారుతూ ప్రయాణం కొనసాగించాడు. ఈ సమయంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌లో పనిచేసే తన స్నేహితులు బాగా సహాయం చేశారని చెప్పాడు. చివరిగా తన ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో నది దాటేందుకు పడవలోనూ ప్రయాణించాడు. దాదాపు మూడు రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 7 ఉదయానికి తన స్వగ్రామానికి చేరుకున్నాడు.