హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి 300వ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్-ధృవ్) బయటకు వచ్చింది. బెంగళూరులోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
1992లో తమ మొదటి యుద్ధ హెలికాప్టర్ నమూనా ఆవిష్కరించినప్పటి నుంచి తాము వెనక్కు తిరిగి చూడలేదని హెచ్ఏఎల్ సంస్థ సీఎండీ ఆర్ మాధవన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానమైన శక్తి సామర్థ్యాలతో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
"ఏఎల్‌హెచ్ మార్క్-1 నుంచి ఏఎల్‌హెచ్ మార్క్-4 వరకు మా ప్రస్థానం అసాధారణమైంది. దేశీయంగా హెలికాప్టర్ల అభివృద్ధికి తొలి అడుగు మాతోనే మొదలైంది."
-హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
2 లక్షల 80 వేల గంటల చరిత్ర..
300వ హెలికాప్టర్ విడుదల ధ్రువపత్రాన్ని.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అధికారి వై.కె.శర్మ నుంచి హెచ్ఏఎల్ సీఈఓ జీవీఎస్ భాస్కర్ అందుకున్నారు. 2 లక్షల 80 వేల గంటలపాటు గాలిలో విహరించిన చరిత్ర ఉన్న హెచ్ఏఎల్ హెలికాప్టర్లు... అన్నిరకాల మిషన్లకు అనుకూలమని జీవీఎస్ భాస్కర్ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా పోరాడుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం హెచ్ఏఎల్... 73 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తోంది. అందులో.. ఆర్మీ-41, నౌకాదళం-16, ఇండియన్ కోస్ట్ గార్డ్-16 హెలికాప్టర్లను వినియోగించనున్నాయి. ఇప్పటికే 38 హెలికాప్టర్లను తయారు చేయగా... మిగిలిన వాటిని 2022 నాటికి పూర్తి చేయనుంది హెచ్ఏఎల్.
ఇదీ చూడండి:రూ.30కే వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసిన యువకుడు