దేశంలోని 30 మునిసిపాలిటీల్లోనే 79 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. దేశంలో కరోనా కేసులు 81,970కి చేరుకున్నాయని.. 2,649 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి మంత్రుల బృందం 15వ సారి ఇవాళ భేటీ అయింది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితికి సంబంధించి మంత్రుల బృందానికి నివేదించారు అధికారులు. అవి...
- ఇప్పటివరకు దేశంలో 27,920 మంది కోలుకున్నారు. గురువారం 1,685 మంది డిశ్చార్జి కాగా 100 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 3,967కు చేరింది. రికవరీ రేటు 34.06 శాతంగా ఉంది.
- దేశంలో రెట్టింపు రేటుపై లాక్డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. లాక్డౌన్ ముందు వారంలో 3.4 రోజులు ఉండగా.. గత వారంలో 12.9 రోజులకు మెరుగుపడింది.
- కరోనా ప్రభావం కొద్ది ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. 79 శాతం కేసులు 30 మునిసిపాలిటీల్లోనే నమోదయ్యాయి.
ఆసుపత్రులు, ఇతర సదుపాయాలు
- దేశవ్యాప్తంగా 8,694 సదుపాయాల్లోని 2,77,429 పడకలను కరోనా బాధితులను చికిత్స కోసం వినియోగిస్తున్నారు. ఇందులో 919 ప్రత్యేక కరోనా ఆసుపత్రులు కాగా, 2,036 ఆరోగ్య కేంద్రాలు, 5,739 కేర్ సెంటర్లు ఉన్నాయి.
- ఈ కేంద్రాల్లో 29,701 ఇంటెన్సివ్ కేర్, 5.15 లక్షల ఐసొలేషన్ పడకలు ఉన్నాయి. 18,855 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
- వ్యక్తిగత సంరక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 3 లక్షల యూనిట్లకు చేరింది. ఎన్-95 మాస్కులు దేశ అవసరాలకు సరిపడా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలకు 84.22 లక్షల మాస్కులు, 47.98 లక్షల పీపీఈ కిట్లను కేంద్రం సరఫరా చేసింది.