కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇది ఉపయోగపడుతోంది. ఇందుకోసం తాజాగా 30 మంది జవాన్లు ముందుకొచ్చారు. తమ వంతుగా ప్లాస్మా దానం చేసి మరింత మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లా మోవోలోని మహారాజ యశ్వంతరావు హోల్కర్ ఆసుపత్రి, ఎంజీఎం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో.. జవాన్ల నుంచి బ్రిగేడియర్ ర్యాంకుల వరకు ఆర్మీ సిబ్బంది ప్లాస్మా ఇచ్చారు.
" మాలో చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. వారంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రజల కోసమే సైన్యం ఉంది. వారి కోసం మా జీవితాలను త్యాగం చేసేందుకైనా సిద్ధం. జీవితాలనే ఇచ్చేస్తున్నప్పుడు ప్లాస్మా దానం చేయటం పెద్ద విషయం కాదు."