లద్ధాఖ్లోని గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికులు మరోసారి భౌతిక ఘర్షణకు దిగారు. సోమవారం రాత్రి ఇరు వర్గాలు పోట్లాడుకోవటం వల్ల హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు.
ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
చైనా దూకుడు..
కొన్ని రోజులుగా తూర్పు లద్ధాక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయాన్ని పసిగట్టిన భారత్ అప్రమత్తమైంది. చైనాకు దీటుగా భారీగా బలగాలను మోహరించింది. ఈ క్రమంలో మే ప్రారంభంలో ప్యాంగాంగ్ సరస్సు, గాల్వన్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
45 ఏళ్ల తర్వాత మొదటిసారి..
పరిస్థితి రోజరోజుకీ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఇరు దేశాలు బలగాల్ని ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. కానీ, సైనికుల్ని తరలించినప్పటికీ.. భారీ స్థాయిలో యుద్ధ వాహనాల్ని చైనా సరిహద్దుల్లోనే మోహరించి ఉంచినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది.
భారత్- చైనా సరిహద్దులో 1975 తర్వాత హింస చెలరేగి సైనికులు మరణించటం ఇదే తొలిసారి. చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణ సద్దుమణిగినట్లు అంతా భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.