భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ సహా మూడు కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్లు భారత భారత ఔషధ నియంత్రణ సంస్థ పరిగణనలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. కొవాగ్జిన్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న 3 టీకాలకు లేదా.. మూడింట్లో ఒకదాని వినియోగానికి త్వరితగతిన అనుమతులు రావొచ్చని పేర్కొంది.
అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఈ మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలు గడచిన 4 రోజుల వ్యవధిలో భారత ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తులు చేసుకున్నాయి. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చేందుకు.. సంబంధిత చట్టంలో వెసులుబాట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మొత్తం 9 టీకాలు..
దేశంలో ఎనిమిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. సీరం, ఆస్ట్రాజెనెకా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పారు. భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై.. మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరించారు. అత్యవసర వినియోగార్థం ఈ రెండు టీకాలు డీజీసీఐకి దరఖాస్తులు చేసుకున్నాయని స్పష్టం చేశారు. రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ ట్రయల్స్‌ను భారత్‌లో డా. రెడ్డీస్ ల్యాబ్స్ నిర్వహిస్తోందని.. వచ్చే వారం మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. నొవావాక్స్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న 'ఎన్వీఎక్స్-సీఓవీ2373' టీకా ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ సైతం నియంత్రణ సంస్థ పరిగణలో ఉందని స్పష్టం చేశారు.