ఎన్నికల ఫలితాలు విడుదలై 26 రోజులు గడిచినప్పటికీ.. 'మహా' ప్రతిష్టంభన ఓ కొలిక్కి రాలేదు. మిత్రపక్షాలు భాజపా-శివసేనకు మెజారిటీ లభించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తలుపుతట్టింది సేన. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా.. ప్రభుత్వ స్థాపనపై నెలకొన్న అనిశ్చితికి ఇప్పట్లో తెర పడే అవకాశాలు కనిపించడం లేదు.
సమావేశాలు... చర్చలు...
ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు ఎదురవడం వల్ల మిత్రపక్షమైన కమల దళంతో తెగదెంపులు చేసుకుంది శివసేన. అనంతరం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్- కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సమావేశాలు, చర్చలు, సంప్రదింపులతో మూడు పార్టీల నేతలు తీరికలేకుండా గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సోనియాతో భేటీ అయ్యారు పవార్. అనంతరం మీడియాతో సమావేశమైన ఆయన... సేనతో పొత్తుపై సోనియాతో చర్చించలేదని తెలిపారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనే సోనియాతో చర్చించినట్టు వివరించారు.