ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇంటర్ విద్యను పూర్తిచేసి ఎప్పుడెప్పుడు పై చదువులు అభ్యసిద్దామా అని ఎదురు చూస్తున్న విద్యార్థుల్లో ఈ ఫలితాలు నూతనోత్తేజాన్ని నింపాయి.
కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అనూహ్యంగా మొత్తం 24 మంది విద్యార్థులు 100 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ విద్యార్థుల జాబితాలో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తలో నలుగురు, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తలో ముగ్గురు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల నుంచి మిగతా విద్యార్థులు చోటు సంపాదించారు.