హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఈసారి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ.. 2014తో పోల్చుకుంటే 3 శాతం ఓటింగ్ పెరిగింది. అయితే లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే కాషాయ పార్టీకి పోలైన ఓట్ల శాతం భారీగా తగ్గింది.
పార్లమెంట్ ఎన్నికల్లో... హరియాణాలోని 79 అసెంబ్లీ సెగ్మెంటుల్లో భాజపా 58.2 శాతం ఓట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. దీనితో పోల్చుకుంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 36.48 శాతం ఓట్లతో 40 అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించగలిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 33.20 శాతం ఓట్లతో 47 సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకోవడం గమనార్హం.
అంచనాలను మించిన కాంగ్రెస్
2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ బాగా పుంజుకుంది. 2014లో 20.58 శాతం ఓటింగ్‌తో 15 సీట్లకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి 28.10 శాతం ఓట్లు సాధించి 31 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో... హరియాణాలో కాంగ్రెస్ కేవలం 28.42 శాతం ఓట్లతో కనీసం ఖాతా తెరవలేకపోయింది. భాజపా మొత్తం 10 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. దీన్ని పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి రాణించింది.
కింగ్ మేకర్ దుష్యంత్
దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతాపార్టీ, స్వతంత్రులు, ఇతరులు కలిసి 27.33 శాతం ఓట్లు సాధించారు.