అవకాశవాద రాజకీయాలకు బిహార్ సరైన వేదిక అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. 2020 శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్విడుదలైన వేళ... అన్ని పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బిహార్ కా షేర్ అనిపించుకునేందుకు పార్టీలన్నీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆందోళనల సెగ తగిలిన నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఈ పోరాటాన్ని బిహార్ ఎన్నికల్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
నితీశ్.. నజర్
అన్ని పార్టీలు రణక్షేత్రంలో పోరాడేందుకు తమ వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, అధికార జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పార్టీకి అన్నితానై వ్యవహరిస్తున్నారు. పట్నాలోని పార్టీ ఆఫీసులోనే మకాం వేసిన ఆయన.. ఎన్నికల వ్యూహాలపై పార్టీనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటున్నారు. ఎన్నికలకు ముందు వారికి మరింత దగ్గరయ్యే ఆలోచనలు చేస్తున్నారు.
జేడీయూ మిత్రపక్షం భాజపా సైతం నితీశ్ ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తోంది. ఎన్డీఏ కార్యకర్తలంతా నితీశ్ కుమార్ ఆదేశాల మేరకే పనిచేయనున్నారు.
ఇదీ చూడండి: బిహార్ పోరు: నితీశ్ 'లిక్కర్' అస్త్రం ఫలించేనా?
ఆర్జేడీ.. అస్త్రాలు
మరోవైపు ప్రతిపక్షం ఆర్జేడీ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ పనితీరు ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై ఆందోళనలకు పిలుపునిచ్చింది. బిహార్ వ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి పోరాటంలో భాగం చేయాలని భావిస్తోంది.