గత 16ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా.. జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి 2019లో పాకిస్థాన్ సైన్యం దాదాపు 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు పేర్కొన్నారు. సగటున రోజుకు 9సార్లు కాల్పులకు పాక్ సైన్యం తెగబడిందని ఓ సహ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు.
2019లో ఇండో-పాక్ సరిహద్దు వెంబడి మొత్తం 3,289సార్లు పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయని.. వీటిలో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన(ఆగస్టు) అనంతరం చోటుచేసుకున్నాయని సమాచారం.
"2019 అక్టోబర్‌లో అత్యధికంగా 398సార్లు కాల్పులు జరిగాయి. నవంబర్‌లో ఈ సంఖ్య 333, ఆగస్టులో 323, జులైలో 314, సెప్టెంబర్‌లో 308, మార్చిలో 275సార్లు పాక్ సైన్యం దుర్నీతిని ప్రదర్శించింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. భయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలు వలస వెళుతున్నారు."
--- హోంశాఖ సీనియర్ అధికారి.