తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛాయ్​వాలా గెలిచాడు.. చౌకీదార్​ సంగతేంటి...? - గెలుపు

నరేంద్ర మోదీ.... గత ఎన్నికల్లో 'ఛాయ్​వాలా'. ఇప్పుడు 'చౌకీదార్'​. ఇవే భాజపా ప్రచార నినాదాలు. ఈ పదాలు ఆయనకిచ్చింది ఎవరో కాదు.. కాంగ్రెస్​ నేతలే. విమర్శనే ప్రచారాస్త్రంగా చేసుకుని భాజపా అనుసరించిన వ్యూహం.... 2014లో పనిచేసింది. మరి 2019 సంగతేంటి? అధికారం చేతులు మారకుండా 'చౌకీదార్​' అడ్డుకోగలడా?

చౌకీదార్​ ఉద్యమంతో ప్రజల్లోకి మోదీ

By

Published : Mar 21, 2019, 6:42 PM IST

చౌకీదార్​ ఉద్యమంతో ప్రజల్లోకి మోదీ

"రైలులో టీ అమ్ముకున్న, వెనుకబడిన కులంలో పుట్టిన వ్యక్తితో నేను పోటీపడాలా అని వారు(కాంగ్రెస్ నేతలు) అనుకుంటున్నారు. వారు నామ్​దార్​(ప్రముఖ వ్యక్తులు). నేను కామ్​దార్​(పనిచేసే వాడిని)".
-- నరేంద్ర మోదీ

2014 జనవరి 19న భాజపా ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఇది. గత సార్వత్రిక సమరంలో భాజపా నినాదం "ఛాయ్​వాలా​". అంటే "టీ అమ్ముకునే వ్యక్తి". నరేంద్రుడి నేపథ్యాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుంది కమలదళం. మోదీ మీలో ఒకరంటూ... పేదలు, సామాన్యులకు చేరువైంది. ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించింది.

ఐదేళ్లు గడిచాయి. రాజకీయం ఎంతో మారింది. సార్వత్రిక సమరం మళ్లీ వచ్చింది. మరి ఈసారి భాజపా ఏం చేస్తోంది? ఎలాంటి ప్రచార వ్యూహం అనుసరిస్తోంది?

" మీరు నిశ్చింతగా ఉండండి... మీ చౌకీదార్​ అన్ని విధాల అప్రమత్తంగా ఉన్నాడు. -- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చౌకీదార్​.... అంటే కాపలాదారుడు. ఇదే ఇప్పుడు భాజపా నినాదం. చౌకీదార్​.... పదం ఎంచుకోవడానికి కారణం ఛాయ్​వాలా వ్యూహమే. సామాన్యులకు చేరువకావడం. దేశానికి మోదీనే సంరక్షకుడని భరోసా కల్పించడం.

మోదీ శైలి ఇదే...

ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టైలే వేరు. ప్రతిపక్షాల వ్యంగ్యాలు, విమర్శలనే అస్త్రాలుగా మలుచుకొని సామాన్యులకు దగ్గరవడం ఆయన ప్రత్యేకత.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత మణిశంకర్​ అయ్యర్​.. "టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అవుతాడా?" అన్నారు. ఆ మాటల్నే ఆయుధంగా మలుచుకున్నారు మోదీ. " నేను ఛాయ్​వాలానే" అంటూ సామాన్యుడినని చెప్పుకున్నారు. ప్రజల కష్టాలు తనకే తెలుస్తాయనే అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు.

2019 లోక్​సభ ఎన్నికలకూ అదే వ్యూహం అనుసరిస్తున్నారు నరేంద్ర మోదీ. నినాదం మాత్రం మారింది. దాన్ని స్వీకరించిందీ కాంగ్రెస్​ నుంచే. రఫేల్​ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ... "చౌకీదార్​ చోర్​ హై" అని మోదీని అనేకసార్లు విమర్శించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఆ​​ విమర్శల నుంచే నినాదాన్ని అందుకున్నారు మోదీ. "నేను చౌకీదార్​నే.. దేశాభివృద్ధి కోసం పాటుపడే ప్రతిఒక్కరూ చౌకీదారే" అని కాంగ్రెస్​ను ఇరుకునపెట్టారు. ట్విట్టర్​లో తన పేరును చౌకీదార్​ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. అదే బాటలో కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు, కార్యకర్తలు పయనించారు.

" 'మై బీ చౌకీదార్' ప్రస్తుతం పెద్ద ప్రజాఉద్యమంగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలోనే మోదీ తాను దేశానికి తొలి సేవకుడినని, చౌకీదార్(కాపలదారుడ్ని) అవుతానని తెలిపారు. ప్రస్తుతం 'చౌకీదార్' ​సామాజిక మాధ్యమాల్లో గ్లోబల్​ ట్రెండ్​గా మారింది. ​కోటి మంది సామాజిక మాధ్యమాల్లో, నమో యాప్​ ద్వారా 'చౌకీదార్​' ప్రతిజ్ఞ చేశారు. మార్చి 31న వీరందరితో దేశవ్యాప్తంగా 500 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగే వీడియో సమావేశంలో మోదీ మాట్లాడనున్నారు."

-రవిశంకర్​ ప్రసాద్, కేంద్ర మంత్రి

మరికొందరు... చౌకీదార్​ ఉద్యమానికి ఫ్యాషన్​ రూపం ఇచ్చారు. 'మై బీ చౌకీదార్' నినాదాన్ని చేతిపై పచ్చబొట్లు వేయించుకుంటున్నారు.

మీరు చౌకీదార్​... మేము బేరోజ్​గార్​

మోదీ పేరుకు ముందు చౌకీదార్​ చేర్చుకుంటే... కాంగ్రెస్​ నేత హార్దిక్​ పటేల్​ 'బేరోజ్​గార్​' పదం జోడించారు. నిరుద్యోగం సమస్యను మోదీ పరిష్కరించలేదని విమర్శించడం హార్దిక్​ ఉద్దేశం.

మరికొందరు నేతలు చౌకీదార్​ ఉద్యమంపై విమర్శలు గుప్పించారు.

"మైబీ చౌకీదార్​ కార్యక్రమం చేపట్టాక, ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు ట్విట్టర్​లో పేర్లకు ముందు చౌకీదార్​ అని చేర్చుకుంటున్నారు. నరేంద్ర మోదీ ఇప్పుడు చౌకీదార్​. మునుపటి లోక్​సభ ఎన్నికల్లో ఉన్న ఛాయ్​వాలా కాదు. భాజపా హయాంలో దేశం చూసిన మార్పు ఇదే. "

-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

మోదీ ధనవంతులు, బడా వ్యాపారులకే చౌకీదార్​ అంటూ రాహుల్​ ఆరోపించారు. పేదలకు చౌకీదార్​ అవసరం లేదని ప్రియాంక అన్నారు.

ABOUT THE AUTHOR

...view details