దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. లాక్డౌన్ సడలించినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 44,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,916 మంది కోలుకోగా.. 2,206 మంది వైరస్‌కు బలయ్యారు.
'మహా' బీభత్సం
మహారాష్ట్రలో వైరస్ విజృంభిస్తోంది. ముంబయిలో ఇవాళ 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 528కి చేరాయని వివరించారు. కొత్తగా 791 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 14,355కి పెరిగినట్లు స్పష్టం చేశారు.
ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ మరో 57 కేసులు నమోదైనట్లు బృహాన్ ముంబయి మున్సిపల్ కార్యాలయం ప్రకటించింది. ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 916కి చేరగా.. మృతుల సంఖ్య 29గా ఉంది.
ఒకే రోజు 20 మంది మృతి
గుజరాత్లో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఒక్క రోజే 20 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్తగా 347 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 8,542కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 513 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో
తమిళనాడులో ఇవాళ ఏకంగా 798 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,002కి చేరినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 53కి చేరింది.