తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ విచారణ విధానపరంగా సరికాదు' - ఆరోపణలు

భారత ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన విచారణ విధానపరంగా సరైనది కాదని సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అభిప్రాయపడ్డాయి. ఆరోపణలపై నిష్పక్ష, స్వతంత్ర విచారణ జరిపేందుకు ఫుల్‌కోర్టు నేతృత్వంలో ఒక కమిటీ నియమించాలని న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది.

ఆ విచారణ విధానపరంగా సరికాదు

By

Published : Apr 22, 2019, 10:28 PM IST

Updated : Apr 23, 2019, 12:02 AM IST

సుప్రీం విచారణపై న్యాయ సంఘాల అభ్యంతరం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయి తనపై వచ్చిన ఆరోపణల పట్ల చేసిన విచారణ విధానపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు 'అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్', 'సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్' అభిప్రాయపడ్డాయి.

ఈ ఆరోపణలపై జరిగిన అత్యవసర విచారణను తీవ్రంగా ఖండించింది న్యాయవాదుల సంఘం. చట్టంలో పొందుపరిచిన విధంగానే ఈ అంశంలోనూ విచారణ జరపాలని కోరింది. ఆరోపణలపై నిష్పక్షపాత, స్వతంత్ర విచారణ జరిపేందుకు ఫుల్‌కోర్టు నేతృత్వంలో ఒక కమిటీ నియమించాలని న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది.

సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగి సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ ప్రమాణపత్రం నకళ్లను 22 మంది ప్రస్తుత సుప్రీం న్యాయమూర్తులకు పంపారు.

సీజేఐపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగోయి నేతృత్వంలోని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరోపణలు వచ్చిన వ్యక్తే విచారణలో కూర్చోవడంపై రెండు న్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

సుప్రీం కోర్టే...

సుప్రీంకోర్టులోని వివిధ విభాగాల తరఫున ఫిర్యాదులు దాఖలు చేసేందుకు అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్‌ను సుప్రీంకోర్టు స్వయంగా నియమించింది.

మరోవైపు...

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 'సుప్రీంకోర్టు ఉద్యోగుల సంక్షేమ సంఘం' ఆయనకు బాసటగా నిలిచింది. జస్టిస్​ రంజన్​ గొగొయిపై వస్తున్న నిరాధార, తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నట్లు తీర్మానంలో స్పష్టం చేసింది.

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి కుటిల ఆరోపణలు చేస్తున్నారని ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉంటామనీ, అందుకోసం మరింత శ్రమిస్తామని పేర్కొంది.

న్యాయవ్యవస్థను అప్రతిష్ఠ పాలుచేసే బయటి శక్తుల ఆటలు సాగనివ్వబోమని, ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రధాన న్యాయమూర్తి వైపు నిలబడతామనీ తీర్మానంలో ప్రకటించింది.

Last Updated : Apr 23, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details