వివిధ ఆహార పదార్థాల కల్తీ గురించి వింటూంటాం. అయితే కల్తీ రాయుళ్లకు శిక్షలు పడే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మాత్రం కల్తీకి తావులేని సమాజాన్ని నిర్మించాలని సంకల్పించారు జిల్లా మేజిస్ట్రేట్. 'మసాలా దోశ' మిశ్రమాన్ని కల్తీ చేసినందుకు ఓ హోటల్‌కు ఏకంగా రూ.2లక్షల 10 వేలు జరిమానా విధించారు. గతేడాది కాలంగా పలు కల్తీ కేసుల్లో రూ.40.5లక్షల జరిమానాలు విధించారు. ప్రజలకు మెరుగైన ఆహార పదార్థాలు అందించే దిశగా కృషి చేస్తున్నారు.
కల్తీపై యుద్ధం..
జిల్లా మేజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ సూచనల మేరకు కల్తీ ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించింది జిల్లా అధికార యంత్రాంగం. కల్తీ నిరోధానికి చేసిన ఈ ప్రయత్నానికి పౌరుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజల సహకారంతో వివిధ హోటళ్లు, దుకాణాల నుంచి నమూనాలు సేకరించిన ఆహార నియంత్రణ అధికారులు.. లఖ్‌నవూ ప్రయోగశాలలో పరీక్షిస్తారు. కల్తీ ధ్రువీకరణ అయితే నిందితులపై కేసులు నమోదు చేస్తారు .