జమ్ముకశ్మీర్ త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. వీరు స్థానిక 'హిజ్బుల్ ముజాహిదీన్' ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు.
పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో సోమవారం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాబలగాలు సైతం దీటుగా స్పందించాయి.
12 గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరిని గుల్షన్పురాకు చెందిన అద్ఫర్ ఫయాజ్ పెర్యాయ్, షరైఫాబాద్కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ రాథర్గా గుర్తించారు. ఎదురుకాల్పుల సమయంలో ఒక స్థానికుడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.