ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని బృందావన్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి గురూ ఉపాధ్యాయ్ సాటిలేని జ్ఞాపక శక్తితో గూగుల్ గురూగా గుర్తింపు పొందాడు. ఏసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు మరెన్నో రికార్డులు సృష్టించి వారెవా అనిపిస్తున్నాడు.
అరవింద్ ఉపాధ్యాయ్, ప్రియాల కుమారుడు గురూ ఉపాధ్యాయ్. సరిగ్గా మాటలు కూడా రావు. బుజ్జి బుజ్జి పలుకులతోనే వివిధ దేశాల పేర్లు, వాటి రాజధానుల్ని చకచకా చెప్పేస్తాడు గురూ. జాతీయ జెండాలనూ గుర్తుపట్టేస్తాడు. బుడిబుడి అడుగులు వేస్తూనే.. అమ్మ అడిగిన వాటన్నింటికీ అక్షరం తడబడకుండా సమాధానాలు చెప్పేస్తాడు. 45కు పైగా దేశాల రాజధానులను గూగుల్‌లో వెతికేలోపే తాను చెప్పేస్తాడు. అందుకే మరి స్థానికులంతా ఈ బుజ్జిగాడిని గూగుల్ గురూ అని పిలుస్తారు.
బుడతడి జ్ఞాపకశక్తికి ప్రపంచ రికార్డులు దాసోహం అయ్యాయి. ఇంత చిన్న వయస్సులో తమ పేరు నిలబెడుతున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నారు ఆ దంపతులు.