తెలంగాణ

telangana

తొలిరోజు సెషన్​లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడీవేడి చర్చ

By

Published : Sep 14, 2020, 12:27 PM IST

Updated : Sep 14, 2020, 12:45 PM IST

కరోనా వేళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనల మధ్య తొలిరోజు లోక్​సభలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ​ సహా ఇటీవల మృతి చెందిన ప్రముఖులకు సంతాపం తెలిపారు సభ్యులు. గంట సేపు వాయిదా పడిన అనంతరం.. తిరిగి ప్రారంభమైన సభలో ప్రశ్నోత్తరాల సమయం కుదింపుపై వాడివేడి చర్చ జరిగింది.

Parliament Monsoon Session first day
ప్రశ్నోత్తరాల సమయం కుదింపుపై పార్లమెంట్​లో వాడివేడి చర్చ

కరోనా నిబంధనల మధ్య.. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ తొలుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యులు, ప్రముఖుల మృతి పట్ల సంతాపం తెలిపింది. ప్రముఖ గాయకుడు పండిట్ జస్ రాజ్, ఛత్తీస్​గఢ్‌ మాజీ సీఎం అజిత్ జోగి, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్ జీ టాండన్, యూపీ మంత్రులు కమల్ రాణి, చేతన్ చౌహన్, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపింది. అనంతరం లోక్ సభ గంటసేపు వాయిదా పడింది.

ప్రశ్నోత్తరాల సమయం కుదింపుపై చర్చ..

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ప్రశ్నోత్తరాల సమయం కుదించటంపై వాడివేడి చర్చ జరిగింది. కరోనావేళ నిర్వహిస్తున్న సమావేశాల్లో మార్పులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. సభా సమయం కుదింపు, ప్రశ్నాకాలం రద్దు చేయడం సహా శూన్య గంట సమయం కుదింపు వంటి అంశాలతో తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రం చర్యపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్షాల విమర్శలు..

ప్రజాసమస్యలు లేవనెత్తడానికి ప్రశ్నోత్తరాల సమయం కీలకమని కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. బ్రిటీష్‌ హయాం నాటి నుంచే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సాంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు.

ప్రశ్నోత్తరాలు తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చడమేనని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఈ అంశంపై లోక్‌సభలో డివిజన్‌ చేపట్టాలని కోరారు.

అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాం..

కరోనా దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయని ప్రతిపక్షాలకు చెప్పారు. సభ్యుల ప్రశ్నల నుంచి ప్రభుత్వం పారిపోవట్లేదని.. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

అటు ప్రశ్నోత్తరాల తొలగింపుపై విపక్ష సభ్యులతోనూ చర్చలు జరిపినట్లు తెలిపిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రి సమాధానం స్పష్టం చేశారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులందరి సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు.

సభ్యులంతా కొవిడ్ నిబంధనలు పాటించాలి..

ఈసారి సమావేశాలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలను సభ్యులందరూ పాటించాలని కోరారు. సభలో డిజిటలైజేషన్‌ విధానం అమలు చేస్తున్నట్లు వివరించిన ఆయన ప్రశ్నలు, సమాధానాలు, సూచనలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో కరోనాపై విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. మనదేశం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సభలో ఏర్పాట్లు ఇలా..

కరోనా దృష్ట్యా సభలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యలు కూర్చునే సీట్ల మధ్య పాలీ కార్బన్ షీట్లు అమర్చారు. కరోనా దృష్ట్యా లోక్‌సభ రోజూ 4 గంటలపాటు మాత్రమే జరుగుతుంది.

ఇదీ చూడండి:పార్లమెంట్ సమావేశాల్లో 47 అంశాలపై చర్చ

Last Updated : Sep 14, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details