తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కూలీలపై ప్రమాదాల పంజా - 17 మంది మృతి - ఉత్తర్​ప్రదేశ్​ మహోబాలో రోడ్డు ప్రమాదం

స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులపై ప్రమాదాలు పగబట్టాయి. సొంతింటికి వెళ్తున్న వారిని పొట్టనబెట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇవాళ జరిగిన వేర్వేరు ప్రమాదాలలో 17 మంది వలసకూలీలు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

migrants acci
వలస కూలీల ప్రమాదాలు

By

Published : May 19, 2020, 4:04 PM IST

వలస కూలీల మృత్యుఘోషతో రహదారులు మార్మోగుతున్నాయి. స్వస్థలానికి వెళ్తున్న కూలీలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇవాళ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 16 మంది వలస కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

బిహార్​లో 9 మంది

బిహార్ భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 9 మంది వలస కూలీలు మరణించారు. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టకుండా తప్పించబోయిన ట్రక్కు డ్రైవర్... వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు బోల్తా పడింది. 31వ నెంబరు జాతీయ రహదారిపై అంభో చౌక్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బిహార్ ప్రమాద చిత్రాలు

బాధితులంతా ఆరు రోజుల క్రితం కోల్​కతా నుంచి సైకిల్​పై స్వస్థలాలకు బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో ట్రక్కు ఎక్కినట్లు వెల్లడించారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు.

బిహార్ ప్రమాద చిత్రాలు

బంగాల్​ నుంచి బిహార్​లోని కతిహార్​ జిల్లా మీదుగా ట్రక్కు వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

బిహార్ ప్రమాద చిత్రాలు

'మహా'లో నలుగురు

మహారాష్ట్ర యావత్మల్ జిల్లా కొల్వన్​ వద్ద ఉదయం 3.30 గంటల సమయంలో ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు వలస కూలీలు మృతిచెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ముగ్గురు

ఉత్తర్​ప్రదేశ్ మహోబా జిల్లా​ ఝాన్సీ-మీర్జాపుర్ హైవేపై వలసకూలీలు వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. బాధితులంతా సోలాపుర్​ నుంచి నాగ్​పుర్ రైల్వేస్టేషన్​కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి శ్రామిక్ రైళ్లలో ఝార్ఖండ్​లోని తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. బస్సు నియంత్రణ కోల్పోవడం వల్లే ట్రక్కును ఢీకొట్టినట్లు చెప్పారు.

దిల్లీ నుంచి కాలినడకనే బయలుదేరిన వీరంతా.. ఉత్తర్​ప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలోని హర్​పాల్​పుర్​ వద్ద ట్రక్కు ఎక్కారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు టైరు పేలిపోవడం వల్ల డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. దీనితో ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయిందని తెలిపారు.

ఒడిశాలో మరో ప్రమాదం

ముంబయి నుంచి బంగాల్​కు వలస కార్మికులను తరలిస్తున్న బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. 24 మంది వలస కూలీలతో వెళ్తూ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులోని 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఒడిశాలో ఆయిల్​ ట్యాంకర్, బస్సు ఢీ
ఒడిశాలో ఆయిల్​ ట్యాంకర్, బస్సు ఢీ
ఒడిశాలో ఆయిల్​ ట్యాంకర్, బస్సు ఢీ

ABOUT THE AUTHOR

...view details