మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం నిన్న విశాఖ, ఛత్తీస్‌గఢ్‌లలో గ్యాస్ లీకేజీ, తమిళనాడులోని ఓ బాయిలర్‌లో మంటలు, మహారాష్ట్ర ఫార్మా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... ఇలా వరుస ఘటనలు సహా దేశప్రజలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇవాళ తెల్లవారుజామున మరో ఘోర దుర్ఘటన జరిగింది.
నిద్దట్లోనే వలసకూలీల బతుకు ఛిద్రమైంది. నడిచి నడిచి అలసి.. పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై గూడ్స్ రైలు దూసుకెళ్లగా 16 మంది దుర్మరణం చెందారు. ఈ భయానక ఘటన.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కర్మాడ్ పరిధిలో జరిగింది. దగ్గర్లోనే నిద్రిస్తున్న మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు అధికారులు. వీరు మహారాష్ట్ర జాల్నాలోని ఓ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
అలసి సొలసి... అనంతలోకాలకు..!
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం... గతరాత్రి జాల్నా నుంచి స్వరాష్ట్రానికి రైలు పట్టాలను అనుసరిస్తూ కాలినడకన బయల్దేరారా వలస పక్షులు. నడిచి నడిచి అలసిన వారు మార్గమధ్యంలో విశ్రాంతి కోసం పట్టాలపైనే పడుకున్నారు. అదే వారి పాలిట యమపాశమైంది. ఉదయం 5.15 గంటలకు జాల్నా నుంచి దూసుకొచ్చిన గూడ్సు.. వారి మీదుగా వెళ్లింది. 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న కర్మాడ్ ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలను గమనించిన లోకోపైలట్.. రైలు ఆపేందుకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని... దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
దిగ్భ్రాంతి...
ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వెంకయ్య నాయుడు. అవసరమైన సాయం చేస్తామని ట్వీట్ చేశారు ప్రధాని. ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. రైలు ప్రమాదం దురదృష్టకరమని ట్వీట్ చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.