తెలంగాణ

telangana

ETV Bharat / bharat

150 ఏళ్లయినా ప్రపంచావనిపై చెరగని మహాత్ముడి ముద్ర - gandhi150

మహాత్మగాంధీ... భారతీయులందరూ కీర్తిస్తున్న ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యం, అహింస... గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలు. ఇవే.. 20వ శతాబ్దిలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నేతగా గాంధీని నిలబెట్టాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా సామాన్య ప్రజల నుంచి.. ప్రపంచ దేశాల నాయకుల వరకు ఎందరినో తన ప్రసంగాలు, రచనలతో ప్రభావితం చేశారు బాపూ. గాంధీ పుట్టి 150 ఏళ్లయినా.. ప్రపంచమంతా మహాత్ముడి సిద్ధాంతాలు పాటిస్తూ.. ఆయన మార్గంలోనే నడుచుకుంటోంది.

150 ఏళ్లయినా ప్రపంచావనిపై చెరగని మహాత్ముడి ముద్ర

By

Published : Sep 27, 2019, 7:01 AM IST

Updated : Oct 2, 2019, 4:27 AM IST

మహాత్ముడిగా ప్రసిద్ధి చెందిన మోహన్​దాస్​ కరంచంద్​ గాంధీ(1869-1948)... ఓ అసాధారణ వ్యక్తి. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఈ నాయకుడు ఎన్నో అసామాన్యమైన ఘనతలు సాధించారు.

అహింసా విధానానికి కచ్చితమైన ఉపదేశకుడిలా కనిపిస్తారు గాంధీ. దేశ రాజకీయ ఉద్యమంలో పాల్గొన్నవారిలో అందరూ పూజించే ఓ గొప్ప ఆధ్యాత్మికవాది. భారత సంప్రదాయాల ప్రకారం.. రుషులు, సాధువులు.. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారు. కానీ.. మహాత్ముడు దీనికి మినహాయింపుగా తన ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగిస్తూనే స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు.

పలువురి మాటలు, రచనల్లో గాంధీ...

మార్గరెట్​ బోర్కే- వైట్​.. ప్రముఖ ఫొటోగ్రాఫర్​, లైఫ్​ మేగజైన్​ డాక్యుమెంటరీ నిర్మాత... గాంధీని ఇంటర్వ్యూ చేసిన చిట్టచివరి మీడియా వ్యక్తి. అదీ హత్యకు కొద్ది గంటల ముందు. ''నిస్సందేహమైన గాంధీ గొప్పతనాన్ని తెలుసుకునేందుకు నా జీవితంలోని కీలకమైన రెండు సంవత్సరాల సమయం పట్టింది.'' అని మార్గరెట్​ తన 'హాఫ్​ వే టూ ఫ్రీడమ్​' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

గాంధీ హత్య జరిగిన సమయంలో ఆయనేం దేశానికి ప్రధానమంత్రి కాదు.. అధికారం కోసం పోరాడే రాజకీయ వేత్తా కాదు... అయినప్పటికీ పలు దేశాలకు చెందిన ప్రముఖ నాయకులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు సంతాపం ప్రకటించారు. లూయిస్​ ఫిశ్చర్​ ​ తాను రాసిన లైఫ్​ ఆఫ్​ మహాత్మ గాంధీ అనే పుస్తకంలో గాంధీ మరణించిన రోజు ''సంపద, ఆస్తి, అధికార పదవి, విద్యా విశిష్టత, శాస్త్రీయ ఘనతలు ఇవేమీ లేని సాధారణ పౌరుడు'' గా అభివర్ణించారు.

పలు దేశ ప్రభుత్వాలు ఆయనకు ఘన నివాళి అర్పించాయి. గాంధీకి అయాచితమైన సానుభూతి తెలుపుతూ దేశ విదేశాల నుంచి దాదాపు 3,441 సందేశాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు మహాత్ముడిని ఎంతలా ఆరాధించారో.. అనుసరించారో..! దీనికంతటికీ కారణం... మహాత్ముడు తన చర్యలతో వారందరికీ అహింసా స్వరూపంలో ఉన్న మానవతావాదిగా కనిపించారు. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఆయన ప్రజల నాయకుడిగా నిలిచారు. 'జాతిపిత'గా సముచిత గౌరవం పొందారు.

ఓ విదేశీ రచయిత నాయకుల్ని రెండు భాగాలుగా విభజించారు....

  1. ప్రతిఫలం ఆశించి ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేసేవారు
  2. ప్రజల ధోరణి, ప్రవర్తనలో పరివర్తన తీసుకొచ్చేలా చేసేవారు

ఆ విధంగా గాంధీని రెండో వర్గానికి చెందిన నాయకుడిగా పేర్కొంటారు. మహాత్ముడు కోట్లాది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మేల్కొలిపేలా చేయగలిగారు. ఈ ప్రక్రియలో తన జీవితం, వ్యక్తిత్వం ఎంతో మెరుగుపడింది. గాంధీ... తన సిద్ధాంతాలతో సమాజంలో సమూల మార్పు, పరివర్తన తీసుకురాగల నాయకుడు కాబట్టి... ప్రపంచంలోని ఏ సమస్యకైనా ఆయన వద్ద పరిష్కారం ఉండేది.

మొత్తం 3 సూత్రాలతోనే...

గాంధీ తన జీవితకాలం మొత్తం... ఏదైనా సమస్యకు తన సిద్ధాంతాల్లో మూడు సూత్రాలను వర్తింపజేశారు. అవి స్వరాజ్​ లేదా స్వీయపాలన, ప్రత్యర్థులతో సహా ఇతరులకు సహానుభూతి, సేవ చేయడం, ప్రార్థించడం.

''స్వాతంత్య్రం కోసం ఆరాటం, దాన్ని సాధించే క్రమంలో భయాలను తొలగించడం, సొంత సామర్థ్యంతో పోరాడటం'' వంటి అంశాలపై ప్రేరణ కల్పించేందుకు గాంధీ ప్రజలతో ఎల్లప్పుడూ సంభాషించేవారు.

దేశంలో ఎక్కువకాలం ఉండాలనుకున్న శక్తిమంతమైన బ్రిటిష్​ సామ్రాజ్యాన్ని ప్రభావితం చేసేందుకు, వారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు గాంధీ 'సత్యాగ్రహం' రూపంలో ఓ అసమానమైన వ్యూహాన్ని అవలంబించారు. ఇది బ్రిటిష్​ వారిపై వ్యతిరేకత వ్యక్తమవడానికి ఉపకరించింది. కానీ.... తుంటికి వస్త్రం చుట్టుకొని వీధుల్లో తిరిగే ఓ సామాన్య వ్యక్తి.. భారతదేశం, ప్రపంచంపై శాశ్వత ప్రభావం చూపించగలరని.. అప్పటి బ్రిటిష్​ అధికారులు గ్రహించలేకపోయారు.

ఓ సందర్భంలో... గాంధీపై దేశద్రోహం కేసు విచారణ సమయంలో ఓ బ్రిటిష్ న్యాయమూర్తి మహాత్ముడికి వందనం చేసి గౌరవంతో వాదనలకు అవకాశమివ్వడం విశేషం. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా బ్రిటిష్​ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు.. మహాత్ముడు అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలమయ్యారు.

గొప్ప నినాదాలతో ముందుకు...

తన నాయకత్వ విధానంలో వినూత్న పద్ధతులతో ప్రజల్లో పోరాటపటిమ తీసుకొచ్చేందుకు కృషి చేశారు గాంధీజీ. సత్యాగ్రహ, స్వరాజ్​, సర్వోదయ్​, అహింసా, హరిజన్​ నినాదాలతో ప్రజల్లో స్వాతంత్య్ర భావాలను రేకెత్తించారు. వారికి మరింత దగ్గరయ్యారు. కొత్త కొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకెళ్లారు.

ఉప్పుపై పన్ను చెల్లించడానికి నిరాకరించి... 1930లో దండి యాత్ర చేపట్టారు. సామాన్య ప్రజల వేదనలు, భావాలను బ్రిటిష్​ ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయడంలో దండి యాత్రను ఓ సాధనంలా ప్రయోగించి... సఫలీకృతులయ్యారు గాంధీ. వైస్రాయ్​ లార్డ్​ ఇర్విన్​పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గాంధీ 1930 మార్చి 2న ఆయనకు ఓ లేఖ రాశారు.

''జీవించడానికి కచ్చితంగా ఉపయోగించాల్సిన ఉప్పుపై పన్ను విధిస్తే సామాన్య వ్యక్తిపై విపరీతమైన భారం పడుతుంది. ఇలా జరుగుతుంది కేవలం దయ లేని మీ నిష్పాక్షికత కారణంగానే.''

తన రచనలపై గాంధీ మాటల్లో...

1946 ఆగస్టు 18న జర్నలిస్టుగా గాంధీ 'హరిజన్'​లో ఇలా రాసుకొచ్చారు.

''నేను ఆలోచనలు ఇచ్చేటప్పుడు.. నాకు వాస్తవికత ఉంది. కానీ.. రచన ఒక ఉప ఉత్పత్తి.. నా ఆలోచనలను ప్రచారం చేయడానికి నేను రాస్తాను. జర్నలిజం నా వృత్తి కాదు. నా రచనలు విషపూరితం కావు.. అసత్యాలు ఉండవు. వారు కోపం నుంచి విముక్తులు కావాలి. దుష్ట సంకల్పాన్ని ప్రోత్సహించడం ద్వారా.. మన లక్ష్యాన్ని సాధించలేమని నా ప్రగాఢ నమ్మకం.. నా రచనల్లో అసత్యాలకు తావులేదు. ఎందుకంటే సత్యం తప్ప వేరే మతం లేదని నా అచంచలమైన విశ్వాసం.''

మహాత్మా గాంధీ చాలా వరకు ప్రజలను ప్రేరేపించారు. ప్రభావితం చేశారు. గుజరాత్​కు చెందిన కుల్సుం​ సయానీ, శ్రీలంకకు చెందిన ఏటీ. అరియారత్నే, మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​(అమెరికా), ఆల్బర్ట్​ జాన్​ లూథులి(ఆఫ్రికా), జోహాన్​ గాల్తుంగ్​, డెన్నిస్​ డాల్టన్​ వంటి విద్యావేత్తలూ గాంధీ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు.

ఎందరికో మార్గనిర్దేశకం...

  • కుల్సుం సయానీ గాంధీ ప్రేరణతో... ఆయనను కలిసిన అనంతరం.. దేశంలో వయోజన విద్యా కార్యక్రమాలను ప్రారంభించారు. 1930ల్లో అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లారు.
  • గ్రామాల అభివృద్ధి కోసం అరియారత్నే శ్రీలంకలో సర్వోదయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
  • అమెరికాలో మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్ వర్ణ వివక్ష,​ జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇందుకోసం.. గాంధీ సిద్ధాంతాలైన అహింసా, శాసనోల్లంఘనోద్యమాలను స్ఫూర్తిగా తీసుకున్నారు.
  • ఆఫ్రికన్​ నేషనల్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు, నోబెల్​ శాంతి పురస్కార గ్రహీత... ఆల్బర్ట్​ జాన్​ లూథులిని గాంధీజీ తీవ్రంగా ప్రభావితం చేశారు. జూలు యోధుల తెగకు చెందిన ఆయనను అహింసా విజేతగా నిలిపింది గాంధీ ప్రేరణ, మార్గాలే. నిజానికి .. గాంధీని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిగా వారంతా అర్థం చేసుకున్నారు.

ఇండో-నార్వేజియన్​ ప్రాజెక్టుకు పనిచేస్తున్న సమయంలో... ప్రముఖ విద్యావేత్త జోహాన్​ గాల్తుంగ్​ స్వాతంత్య్రసాధనలో గాంధీ పాత్రపై దక్షిణ భారతంలోని కేరళలో ప్రతివాదుల నుంచి అభిప్రాయ సేకరణకోసం ఓ సర్వే నిర్వహించారు. గాంధీనే దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టారని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది.

రచనల్లోనూ గాంధీ సిద్ధాంతాలే...

గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని.. ప్రముఖ ఆంగ్లో ఇండియన్​ రచయితలు మహాత్ముడి మార్గంలో నడిచిన వారి పాత్రలను తన నవలల్లో చిత్రీకరించారు. ముఖ్యంగా ముల్క్​ రాజ్​ ఆనంద్​, ఆర్కే నారాయణ్​, రాజా రావు వంటి వారు గాంధీ భావవ్యక్తీకరణల నేపథ్యాన్ని తన రచనల్లో చక్కగా చూపించగలిగారు.

ముల్క్​రాజ్​ ఆనంద్​.. 1935లో 'అన్​టచబుల్'​ అనే నవల రచించారు. ఇందులో గాంధీ మార్గాల్లోని.. అంటరానితనం నిర్మూలన గురించి చెప్పారు.

1955లో ఆర్కే నారాయణ్​ రచించిన 'వెయిటింగ్​ ఫర్​ ది మహాత్మ'లో గాంధీ సిద్ధాంతాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధాన పాత్రల్లోని హీరో శ్రీరామ్​, హీరోయిన్​ భారతి జీవితాల్లో గాంధీ మూలాలు కనిపిస్తాయి. క్విట్​ ఇండియా ఉద్యమ సమయంలో భాగంగా గాంధీ.. శ్రీరామ్​కు సరళమైన జీవన విధానం, ప్రేమను చూపిస్తారు. ఇది అతనిపై ప్రభావం చూపిస్తోంది. ఇక హీరోయిన్​ భారతి.. పూర్తిగా గాంధీ భావజాలాన్ని పాటిస్తూ.... భారత మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తోంది.

శాసనోల్లంఘనోద్యమంలో కాంతాపుర గ్రామ ప్రజలు పోషించిన పాత్రను రాజారావు 1938లో తాను రచించిన 'కాంతాపుర' నవలలో ప్రస్తావించారు.

ప్రసార విధానాల్లో గాంధీ పాత్ర...

ప్రసార విభాగం విధానాలపైనా గాంధీ ప్రభావం చూపించారు.

ప్రముఖ మీడియా పరిశీలకుడు రాబిన్​ జెఫ్రీ ప్రకారం.. స్వాతంత్య్రానంతరం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను నిర్వహించిన వల్లభ్​భాయ్​ పటేల్​, ఆర్​ఆర్​ దివాకర్​, డా. బీవీ కేస్కర్​ గాంధీని అనుసరించారు. 15 సంవత్సరాలపాటు ప్రసార విధానాలను రూపొందించారు.

పటేల్​(1947-50లలో), అతని సన్నిహితులు దివాకర్(పటేల్​ కింద జూనియర్​ మంత్రిగా ఉన్నారు) (1950-52), దిగ్గజ డా.బీవీ కేస్కర్​(1952-62) మధ్యకాలంలో సమాచార, ప్రసార శాఖల విధానాలను రూపొందించారు.

ఉదాహరణకు పాశ్చాత్య విద్యావిధానానికి ప్రభావితులైన పటేల్​.. అనంతరం గాంధీ జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. నూలు ఒడకటం, ఖాదీ, శాఖాహారం, నైతిక విలువలు పాటించడం.. గాంధీతో కార్యక్రమాల సందర్భంగా మెల్లమెల్లగా అలవాటుపడ్డారు.

గాంధీ జీవన సమాహారంతో పెద్ద పుస్తకం...

1956లో జవహర్​లాల్​ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో.. గాంధీ రచనలు, ప్రసంగాలను సంరక్షించే విధంగా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఇది పూర్తికావడానికి 38 ఏళ్లు పట్టింది. మొత్తంగా 100 సంపుటాల్లో 'కలెక్టెడ్​ వర్క్స్​ ఆఫ్​ మహాత్మగాంధీ' పేరిట.. 1884-1948 మధ్యకాలంలోని 64 ఏళ్ల గాంధీ జీవిత సమాహారాన్ని 50 వేల పేజీల్లో పొందుపరిచారు. వీటికి ముందుమాట భారత తొలి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్​ రాశారు. అదేంటంటే...

ఆరు దశాబ్దాలుగా మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపిన గొప్ప వ్యక్తి మాటలు ఇందులో ఉన్నాయి. ప్రజలందర్నీ ఓ గొప్ప సంకల్పంతో ముందుకు తీసుకెళ్లి.. సఫలీకృతమైన విధానాలు ఇక్కడ ఉన్నాయి. లెక్కలేనంత మందిని ప్రభావితం చేసిన మాటలు, వారిలోని ప్రతిభను వెలికితీసిన భావాలు.. వారికి కొత్త జీవన విధానాన్ని చూపించిన మార్గాలు.. ఇక్కడ ఉన్నాయి.

ఇంకా గత 60 సంవత్సరాల్లో మహాత్మగాంధీ జీవనం, స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన భాగంతో ముడిపడిఉన్న అసంఖ్యాక పుస్తకాలు, జర్నల్స్​ కథనాలు, పరిశోధనా నివేదికలు, వార్తాపత్రికల కథనాలు.. ఇప్పటికీ ప్రజల జీవితాల్లోని వేర్వేరు కోణాల్లో.. ఏదో ఒక సందర్భంలో ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.

ఉదాహరణకు గూగుల్​ శోధనలో మనకు మహాత్మగాంధీపై లక్షలాది రిఫరెన్స్​లు దర్శనమిస్తాయి. దీనిని బట్టి 20వ శతాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన, స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన వ్యక్తి గాంధీజీ అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. 150వ జయంత్యుత్సవాల సమయంలోనూ మహాత్ముడిని ఇప్పటికీ ప్రపంచం జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంది. ఆరాధిస్తోంది. ఇప్పటికీ ఏ దేశమైనా.. శాంతియుత భావనను కోరుకున్నప్పుడు అహింసా విధానాన్ని అంగీకరిస్తున్నారంటే గాంధీని ఎంతలా ప్రేరణగా తీసుకున్నారో అర్థమవుతోంది.

--------- (రచయిత.. ప్రొ. డీవీఆర్​ మూర్తి, ఆంధ్రా యూనివర్సిటీ)

Last Updated : Oct 2, 2019, 4:27 AM IST

ABOUT THE AUTHOR

...view details