తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ర్యాగింగ్​: 150 మంది జూనియర్లకు ఒకేసారి గుండు

వృత్తి విద్యా కళాశాలలకు కొత్తగా వచ్చిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఆట పట్టిస్తుంటారు. అయితే కొన్నిసార్లు అది పరిధులు దాటి జూనియర్ల ఆత్మగౌరవాన్ని కూడా చిదిమేస్తూ ఉంటుంది. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. ర్యాగింగ్ పేరిట 150 మంది జూనియర్లకు గుండు కొట్టించడం సహా వారితో వంగివంగి నమస్కారాలు పెట్టించుకుంటూ సీనియర్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు.

గుండు కొట్టించుకుని.. వంగి వంగి దండాలు పెట్టాల్సిందే!

By

Published : Aug 21, 2019, 6:08 PM IST

Updated : Sep 27, 2019, 7:25 PM IST

యూపీ మెడికల్ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం
కళాశాల అంటే పిల్లచేష్టల నుంచి హుందాతనం అలవరుచుకోవడం ఎలాగో నేర్పించే రెండో అమ్మ ఒడి. అయితే అమ్మ ఒడిలో ఉన్నంతసేపు ఎవరైనా ఎంతో భరోసాగా ఉంటారు. ప్రస్తుతం కళాశాల అనే అమ్మ ఒడి జూనియర్ల పాలిట నరకంగా మారింది. కొత్త వాళ్లను పరిచయం చేసుకొనే పేరిట మొదలైన ర్యాగింగ్‌ ప్రక్రియ వికృత రూపం దాల్చి సీనియర్ల దాష్టీకాలకు చిరునామాగా మారింది.

150 మందిపైనే..

ఉత్తర్‌ప్రదేశ్ సఫాయిలోని వైద్య విశ్వవిద్యాలయంలో ఆయుర్వేదం అభ్యసిస్తున్న 150 మంది మొదటి సంవత్సరం విద్యార్థులంతా.. సీనియర్ల ర్యాగింగ్‌లో భాగంగా గుండు కొట్టించుకొని తెల్లని దుస్తుల్లో కళాశాలకు రావాలి. ఓ క్రమ పద్ధతిలో లైన్‌లో వెళ్లాలి. ఎక్కడైనా సీనియర్లు ఎదురైతే వారికి వంగి వంగి సలాములు కొట్టాలి. మధ్య యుగాల్లో లేదా రాచరికం వేళ్లూనుకుపోయిన దేశాల్లో ఇలాంటి సంస్కృతి ఉంటుంది. కానీ దురదృష్ట వశాత్తు వైద్యో నారాయణో హరి అని గొప్పగా మనం చెప్పుకొనే వైద్యులను తయారు చేసే ప్రాంగణంలో ఈ సంస్కృతి వేళ్లూనుకొని పోయింది.

యాజమాన్యానికి తెలియదట..

ఆ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా ఇంత జరుగుతున్నాఆ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి తెలియనే తెలియదట. పైగా మా విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఉందని, జూనియర్లకు ఏవైనా సమస్యలు ఉంటే వారికి చెప్పుకొంటారని విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్‌కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి ప్రస్తావించగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

" ఈ విషయంలో మేము కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కొందరు విద్యార్థులను సస్పెండ్ కూడా చేశాం.ఎవరైనా క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలితే వారి పట్ల మా చర్యలు కఠినంగా ఉంటాయి. "

- రాజ్‌కుమార్‌, ఉపకులపతి, యూపీ మెడికల్ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం

ఈ విశ్వవిద్యాలయం సఫాయి అనే గ్రామంలో ఉంది. యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్‌యాదవ్‌, అఖిలేష్ యాదవ్‌ల స్వగ్రామం అది.

దేశవ్యాప్తంగానూ ర్యాగింగ్ ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2015లో 423 చోటు చేసుకుంటే గత ఏడాది ఆ సంఖ్య దాదాపు రెట్టింపైంది. గత కొద్ది నెలల వ్యవధిలో ర్యాగింగ్ భూతానికి దక్షిణాది రాష్ట్రాల్లో ముగ్గురు విద్యార్థులు కూడా బలయ్యారు.

ఇదీ చూడండి: ఈ పావురం 1750 కి.మీ. పయనించి గిఫ్ట్ కొట్టేసింది!

Last Updated : Sep 27, 2019, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details