తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ - ramoji group houses

కేరళ వరద బాధితుల కోసం రామోజీ గ్రూప్​ సహకారంతో నిర్మించిన ఇళ్లను ఆదివారం లబ్ధిదారులకు అందించనున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్. ఇంటి తాళాలు అందజేసి 121 కుటుంబాల్లో కొత్త వెలుగు నింపనున్నారు. అలప్పుజలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత రమేశ్​ చెన్నితల, రామోజీ గ్రూప్​ ఫౌండేషన్​ ప్రతినిధులు పాల్గొననున్నారు.

ramoji group houses
కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ

By

Published : Feb 8, 2020, 6:46 PM IST

Updated : Feb 29, 2020, 4:10 PM IST

కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- 121 ఇళ్ల పంపిణీ

కళ్ల ముందే కలల సౌధం కూలిపోతే..! చూస్తుండగానే ఊరు ఊరంతా మునిగిపోతే..! ఆశ్రయం కోల్పోయి... తల దాచుకునేందుకు ఓ చోటు కూడా దొరకకపోతే..! ఆ బాధ వర్ణించటానికి భాష సరిపోదు. ఏడాదిన్నర క్రితం కేరళలో ఇదే జరిగింది. ఏ ప్రకృతి అయితే ఆ ప్రాంతానికి వన్నె తెచ్చి పెట్టిందో... అదే ప్రకృతి వరద రూపంలో వచ్చి అన్ని ప్రాంతాలనూ తుడిచి పెట్టింది. గుండెలవిసే వేదన మిగిల్చింది. ఇల్లూ వాకిలీ, గొడ్డూ గోదా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున నిలబెట్టింది. వరదల తరవాత చిన్న చిన్న గుడిసెల్లో కష్టాలు పడుతున్న ఆ బాధితులకు 'సొంతిల్లు' కలలో కూడా రాని మాట. అలాంటిది.. ఇప్పుడు రామోజీ గ్రూప్, మరికొందరు దాతల సహకారంతో సౌకర్యంగా కట్టిన 2 పడకగదుల ఇళ్లకు వాళ్లంతా యజమానులవుతున్నారు.

అలప్పుజలో రామోజీ గ్రూప్ నిర్మించిన 121 ఇళ్లను ఆదివారం లబ్ధిదారులకు అందించనున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ప్రతిపక్ష నేత రమేశ్​ చెన్నితల ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామోజీ గ్రూప్​ తరఫున ఈనాడు ఎండీ కిరణ్​, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ హాజరుకానున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబశ్రీ మిషన్​ డైరక్టర్​ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభంకానుంది. సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగిస్తారు. ఐఏఎస్​ అధికారి కృష్ణతేజకు మెమెంటో బహూకరిస్తారు. కొత్త ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు.

121 ఇళ్లు...

అలప్పుజ జిల్లాలో నిరాశ్రయులైన వారందరికీ నిలువ నీడ కల్పించాలన్న సదుద్దేశంతో ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టింది రామోజీ గ్రూప్. కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక సంఘం కుటుంబశ్రీతో గతేడాది మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఖర్చుకు వెనకాడకుండా ఏడాదిలో నాణ్యమైన ఇళ్లను కట్టించి ఇవ్వాలన్నది అందులోని సారాంశం. గతేడాది మార్చి నెలలోనే ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం డిసెంబర్ నాటికి ముగిసింది. ఒప్పందం ప్రకారం 116 ఇళ్లే నిర్మించాల్సి ఉంది. అయితే.... నాణ్యతలో రాజీ పడకుండానే పొదుపుగా ఖర్చు చేసి మిగిలిన డబ్బుతో మరో ఐదు ఇళ్లు అదనంగా కట్టగలిగారు. ఇలా మొత్తం 121 ఇళ్ల నిర్మాణం పూర్తైంది. ఇందుకు కావాల్సిన వస్తువులు, సామగ్రిని కొందరు స్థానిక వ్యాపారులే అందించారు.
కేరళ హౌసింగ్​ ప్రాజెక్టు తర్వాత వరదల బాధితుల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండో అతిపెద్దది.

రెండు మీటర్ల ఎత్తులో...

ఇళ్ల నిర్మాణం పూర్తవటంలో నాటి అలప్పుజ సబ్‌కలెక్టర్ కృష్ణతేజ కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు దృష్టిలో ఉంచుకుని... ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేశారు. రవాణాకు అత్యంత కష్టంగా ఉండే ప్రదేశాల్లో పదుల కిలోమీటర్ల దూరంలో ఒక్కో ఇల్లు ఉండేలా చూసుకున్నారు. మిగిలిన ఇళ్లతో పోలిస్తే ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఇంటి నిర్మాణం కోసం ఎంపిక చేశారు. సముద్రమట్టానికి ఒకటిన్నర నుంచి రెండు మీటర్లు ఎత్తుగా ఉండేలా ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు వహించారు. తద్వారా ఈ సారి వరదలు వచ్చినా ఇంటికి ఏ మాత్రం నష్టం కలగకుండా వెసులుబాటు కల్పించారు.

రూ.3కోట్లతో ప్రారంభమైన నిధి

సాయం చేయాలన్న మనసుంటే చాలదు. అది ఎలా చేస్తే.. ఆ ఫలం ఎదుటి వారికి దక్కుతుందన్నదీ ఆలోచించాలి. ఈ విషయంలో రామోజీ గ్రూపు సఫలమైంది. కేరళ వరదల్లో నిరాశ్రయులైన వారికి ఏదో సహకారం అందించాలని అనుకున్నదే తడవుగా 3 కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధి ఏర్పాటు చేసింది. డబ్బు రూపంగా సాయం చేయటం కన్నా ఓ శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని భావించింది. అందులో భాగంగానే ఇళ్ల నిర్మాణం చేపట్టింది. కేరళీయులను అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత గుర్తు చేస్తూ రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో కదిలి రావాలని ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. కేరళ కల్లోలాన్ని చూసి ద్రవించిన హృదయాలన్నీ ఇందుకు స్పందించాయి. పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవారు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా తమ వంతు సాయమందించారు. అలా ఆ నిధి అక్షరాలా 7 కోట్ల 77 లక్షల రూపాయలకు చేరుకుంది.

బాధితుల ముఖంలో చిరునవ్వు..

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన తమకు రామోజీ సంస్థ అందిస్తున్న ఈ నూతన గృహాలపై అలప్పుజ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ మానసిక వేదన అర్థం చేసుకుని సాయమందించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అనుకోని విధంగా వరదలు తమ జీవితాల్ని అస్తవ్యస్తం చేసినా... తెలుగు రాష్ట్రాల ప్రజలు తమను ఆదుకోవటం పట్ల ఆనందంగా ఉన్నారు. దైవం మానుష రూపేణ అనే సూక్తికి రామోజీ గ్రూప్ చేసిన సాయం తార్కాణమని కొనియాడుతున్నారు.

Last Updated : Feb 29, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details