రెండురోజుల సౌదీఅరేబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ..ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్‌తో పాటు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
ఈ పర్యటనలో దాదాపు 12 అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల పరస్పర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలికి మోదీ, యువరాజు సల్మాన్ అధ్యక్షులుగా ఉంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమావేశమై చర్చలు జరుపుతారు.
ఉగ్రవాదంపై పోరు
ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించారు మోదీ, సల్మాన్. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రకటించారు. జాతి, మతం, సంస్కృతితో సంబంధం లేకుండా తీవ్రవాదంపై పోరుకు సహకరిస్తామని..పాకిస్థాన్‌కు సహజ భాగస్వామి అయిన సౌదీఅరేబియా భారత్‌కు హామీ ఇచ్చింది.
ఇంధన సహకారం
ఇరుదేశాల మధ్య ఇంధన సహాకారంపైనా సౌదీ ఇంధనశాఖ మంత్రి యువరాజు అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్‌తో చర్చలు జరిపారు మోదీ . మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో నిర్మిస్తున్న వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇరాక్ తర్వాత భారత చమురు అవసరాలను తీర్చుతున్న రెండో దేశం సౌదీనే కాగా.... ఏటా 40.33 మిలియన్ టన్నుల ముడిచమురును సౌదీ అరేబియా నుంచి దిగమతి చేసుకుంటోంది భారత్. నెలకు 2లక్షల టన్నుల ఎల్పీజీని కొనుగోలు చేస్తోంది. ఇటీవల సౌదీకి చెందిన చమురు బావులపై దాడులు జరుగుతున్నప్పటికీ భారత్‌కు ఇంధన సరఫరాలో ఏ విధమైన సమస్యలు రాబోవని సౌదీ పేర్కొంది.