తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీపై పోటీకి 111మంది అన్నదాతలు సిద్ధం - MANIFESTO

పంటలకు మద్దతు ధర అంశాన్ని భాజపా మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేసింది తమిళ రైతు సంఘం. లేదంటే 111మంది రైతులు మోదీకి వ్యతిరేకంగా వారణాసి లోక్​సభ నుంచి పోటీ చేసేందుకు నామపత్రాలు దాఖలు చేస్తారని హెచ్చరించింది.

మోదీపై పోటీకి సిద్ధమైన 111మంది అన్నదాతలు

By

Published : Mar 23, 2019, 7:08 PM IST

పంటలకు మద్దతు ధర కల్పిస్తామనే హామీని భాజపా మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్​ చేశారు తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు అయ్యకన్ను. లేకపోతే వారణాసిలో మోదీకి పోటీగా 111మంది రైతులు నామినేషన్లు దాఖలు చేస్తారని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల నదుల అనుసంధాన రైతు సంఘానికి సైతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అయ్యకన్ను.

రైతులకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్​తో 2017లో దీక్ష చేశారు అయ్యకన్ను. ఆ సమయంలో సిక్కు రైతులు అన్నం పెట్టి తమను ఆదుకున్నారన్నారు. మద్దతు ధర కల్పిస్తామని భాజపా మేనిఫెస్టోలో చేర్చితే పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు.

మద్దతు ధర కోరుతోన్న తమిళ రైతులు

" మద్దతు ధర కల్పించాలని 141 రోజుల పాటు దిల్లీలో ఉద్యమం చేశాం. ​ మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ ​రాధాకృష్ణన్. కానీ ఆయన హామీని నెరవేర్చలేదు. భాజపా ఎన్నికల మేనిఫేస్టోలో రైతులకు మద్దతు ధర ప్రకటించకుంటే మోదీ పోటీ చేసే స్థానంలో 111 మంది రైతులు నామినేషన్​ వేస్తారు. మద్దతు ధర కల్పించేవారికే మేము అండగా నిలుస్తాం. మద్దతు ధర అంశం లేకుండా ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా దాన్ని ఓడించేందుకు మేమంతా పనిచేస్తాం. -అయ్యకన్ను, తమిళ రైతు సంఘం అధ్యక్షుడు

మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసే విషయంలో అఖిల భారత రైతు సంఘర్షణ సహకార సమితి తమకు మద్దతు ప్రకటించిందని వెల్లడించారు. రైతు రుణమాఫీ చేస్తామని డీఎం​కే, అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం వంటి పార్టీలు తమ మేనిఫేస్టోల్లో చేర్చాయన్నారు అయ్యకన్ను. ఇప్పటికే మూడు వందలమంది రైతులు వారణాసికి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్​ చేశామని వెల్లడించారు. 60 ఏళ్లు నిండిన రైతులకు పింఛన్​ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2018 నవంబర్​లో దిల్లీలో రైతు దీక్ష సందర్భంగా రెండు మానవ కపాలాల్ని తీసుకెళ్లారు తమిళ రైతు సంఘం సభ్యులు. అవి ఆత్మహత్య చేసుకున్న తమ సహచర రైతులవని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details