ఇక్కడ కనిపిస్తున్న ఈ యువతి.. మలప్పురంలోని ఓ ఉన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. రెస్బిన్ అనే ఈ అమ్మాయికి ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో స్నేహితులున్నారు. ఆ ఫ్రెండ్స్ ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో కాదు. డిజిటల్ ప్రపంచంలోనూ చేతితో రాసిన లేఖలతోనే ప్రపంచవ్యాప్తంగా సన్నిహితులను ఏర్పరచుకుంది రెస్బిన్. పేపర్తో తయారుచేసిన కళాకృతులను ఓసారి ఇన్స్టాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ కథంతా మొదలైంది.
మెక్సికోకు చెందిన సారా అనే అమ్మాయి ఆ కళాఖండాలు చూసి ఆసక్తితో రెస్బిన్తో మాట కలిపింది. అక్కడి నుంచి లేఖల పరంపరకు బీజం పడింది. సారాతో మొదలు పెట్టిన లేఖల మైత్రీబంధాన్ని తర్వాత అమెరికా, జపాన్, బ్రిటన్, ఇండోనేసియా, స్పెయిన్ సహా ఎన్నో దేశాలకు విస్తరించింది రెస్బిన్. ఉత్తరం రాసిన ప్రతిసారి ప్రత్యుత్తరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. క్షణాల్లో ఈమెయిల్స్, లైవ్ మెసేజెస్ పంపుకునే వీలున్న ఈ రోజుల్లోనూ తనకోసం వచ్చిన లేఖలు మురిసిపోతూ చదువుకుంటుంది.
"నేనో పేపర్ఆర్టిస్టుని. డూడుల్స్ గీస్తాను. డూడుల్స్ గీయడమంటే చాలా ఇష్టం. నాకు బాగా నచ్చినవాటిని ఇన్స్టాలో పోస్ట్చేస్తా. అనుకోకుండా ఓరోజు ఓ అమెరికా అమ్మాయి మెసేజ్ చేసింది. నా డూడుల్స్ నచ్చి, చిరునామా పంపమని అడిగింది. ఉత్తరాలు రాస్తుంటా అని చెప్పింది. కొన్ని నెలల తర్వాత ఉత్తరం వచ్చింది, నేనూ ప్రత్యుత్తరం పంపాను. ఆ అనుభూతి బాగా నచ్చింది. ఎన్నో మధుర జ్ఞాపకాలనిస్తోంది ".
- రెస్బిన్, కేరళ.