తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ. - కరోనా

చేతిలో చిల్లిగవ్వయినా లేనంత పేదరికం. సొంతూరేమో 1,090 కిలోమీటర్ల దూరం. భానుడి భగభగలు ఓవైపు... ఆకలిదప్పులు మరోవైపు. అయినా ఆ 11 మంది వలస జీవులు వెనక్కి తగ్గలేదు. సంకల్పం, సాహసం, సమయస్ఫూర్తిని రిక్షాకు 3 చక్రాలుగా మార్చుకున్నారు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 8 రోజులు కాళ్లకు పనిచెప్పి... ఎట్టకేలకు సొంతూళ్లకు చేరారు.

Gurgaon-Bihar: Eight days, 1,000 km and 11 men on 11 cycle rickshaws
లాక్​డౌన్​ జర్నీ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కిలోమీటర్లు

By

Published : May 27, 2020, 8:15 AM IST

Updated : May 27, 2020, 9:45 AM IST

"రెండు నెలలుగా పని లేదు. సొంత ఊరిలో ఉన్న కుటుంబ సభ్యులు మేము డబ్బులు పంపుతామని ఎదురుచూస్తున్నారు. పట్టణంలో మేము ఉంటున్న ఇంటి యజమాని అద్దె కోసం ఒత్తిడి చేస్తున్నారు"... దేశంలోని కోట్ల మంది వలస కూలీల 'లాక్​డౌన్​ వ్యథ' ఇది. అలాంటి శ్రమజీవుల్లో భరత్ కుమార్​ ఒకడు. ఏకంగా 1,090 కిలోమీటర్లు రిక్షా తొక్కి ఇటీవలే స్వస్థలానికి చేరుకున్నాడు అతడు.

హరియాణా టు బిహార్​...

భరత్ కుమార్ వయసు 48 ఏళ్లు. స్వస్థలం బిహార్​ ముజఫర్​నగర్ జిల్లా బాంగ్రా. జీవనోపాధి కోసం హరియాణా గురుగ్రామ్​లో రిక్షా తొక్కేవాడు. కరోనా లాక్​డౌన్​తో బతుకు చక్రం ఆగిపోయింది.

"లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి పని లేదు. చేతిలో డబ్బు లేదు. అందుకే సొంతూరు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నా. శ్రామిక్​ ప్రత్యేక రైలులో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నా. టికెట్ కన్ఫర్మ్​ అయిందని చెప్పేందుకు అధికారులు ఎవరైనా ఫోన్​ చేస్తారేమోనని రోజూ ఆశగా ఎదురుచూశా. ఫోన్​ మోగింది. కానీ కాల్ చేసింది అధికారులు కాదు. మా ఇంటి యజమాని. అద్దె కట్టకపోతే సామాను బయటపడేస్తానని హెచ్చరించాడు."

-భరత్​, రిక్షావాలా

స్టేషన్​ కలిపింది అందరినీ...

టికెట్ కన్ఫర్మేషన్​ కాల్​ కోసం ఎదురుచూసిన భరత్​కు ఓపిక నశించింది. ఒకరోజు నేరుగా గురుగ్రామ్​ రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. కానీ.. అక్కడి సిబ్బంది అతడ్ని లోపలకు రానివ్వలేదు. అక్కడే భరత్​కు మరో 10 మంది పరిచయం అయ్యారు. అందరిదీ ఒకటే కథ. అందరి గమ్యం ఒకటే... బిహార్.

11 మంది కూర్చుని మాట్లాడుకున్నారు. సాహసం చేయక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. 11 మంది కలిసి 11 రిక్షాలతో 1,090 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించారు. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడం ఎలా? ఏ మార్గంలో వెళ్తే ఆహారం దొరుకుతుంది? రిక్షా టైరు పంక్చర్ పడితే ఎక్కడ బాగు చేయించుకోవాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు సాగారు.

"దారిలో పోలీసులు ఆపేస్తారని, కొడతారని చాలా భయపడ్డాం. కానీ వాళ్ల దృష్టిలో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రాత్రి వేళల్లోనే ఎక్కువ ప్రయాణించాం. పగలు చాలా వేడిగా ఉండేది. అదృష్టవశాత్తూ పోలీసులు ఎవరూ మమ్మల్ని పట్టుకోలేదు. కొందరు మహానుభావులు అప్పుడప్పుడు మాకు భోజనం పెట్టారు. కానీ కొన్నిసార్లు ఆకలితోనే ప్రయాణం సాగించాల్సి వచ్చింది."

-భరత్​, రిక్షావాలా

సొంతూరుకు వచ్చేసిన భరత్... జీవనోపాధి కోసం ఇకపై ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. సుదీర్ఘ ప్రయాణంతో బాగా అలసిపోయానని చెప్పాడు.

అలా వెళ్తే సులువయ్యేది కానీ...

నిజానికి 11 మంది 11 రిక్షాలు తొక్కాల్సిన అవసరం లేదు. ఒక్కో రిక్షాలో ఇద్దరు వెళ్లొచ్చు. అప్పుడు ఒకరు కాసేపు తొక్కొచ్చు, మరొకరు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ భరత్​ గ్యాంగ్​ అలా చేయలేదు.

"మాకు ఉన్న ఏకైక ఆస్తి రిక్షా మాత్రమే. మళ్లీ గురుగ్రామ్​కు ఎప్పుడు వెళ్తామో తెలియదు. అలాంటప్పుడు రిక్షాను వదిలేసి ఎలా వస్తాము? అందుకే సామాను మొత్తం అందులో ఎక్కించాం. బయలుదేరే ముందు రోజు గురుగ్రామ్​లోని వేర్వేరు చోట్ల ఉచితంగా అందిస్తున్న ఆహారాన్ని సేకరించాం."

-ఝోఖూ, భరత్​ స్నేహితుడు

"నేను సొంతూరుకు వచ్చేశా. అయినా ఇప్పటికీ శ్రామిక్ రైలు టికెట్ గురించి ఎలాంటి అప్​డేట్​ రాలేదు. నేను అక్కడే ఉండి ఉండొచ్చు. కానీ... ఒకరి సాయంపై ఆధారపడి ఎంత కాలం బతుకుతా? నాకు ఎలాంటి సాయం అందదని అర్థమైంది. అందుకే నా దారి నేను చూసుకున్నా" అని చెప్పాడు 11 మందిలో ఒకడైన 36 ఏళ్ల దయానాథ్​.

దారిలో దయానాథ్​ రిక్షా పాడైంది. మిగిలిన వారంతా అతడికి అండగా నిలిచారు. చాలా దూరం ఆ రిక్షాన్ని మరో రిక్షాకు కట్టి లాక్కొచ్చి, బాగు చేయించారు.

అద్దె రిక్షాతోనే సొంతూరుకు...

భరత్​ గ్యాంగ్​లో 10 మందికి సొంత రిక్షాలు ఉన్నాయి. రాజు కథ మాత్రం భిన్నం.

"నాకు సొంత రిక్షా లేదు. అద్దె రిక్షానే తొక్కేవాడిని. నేను సంపాదించిన దానిలో కొంత సొమ్మును యజమానికి ఇచ్చేవాడిని. నేను ఆ రిక్షాను హరియాణా నుంచి బిహార్​కు తీసుకొచ్చేశానని ఆయనకు తెలియదు. ముందు చెప్పి ఉంటే ఆయన కోప్పడేవాడు. నేను మిగిలిన రిక్షాల్లో ఏదో ఒక దానిలో వచ్చి ఉండొచ్చు. కానీ మేమంతా అద్దె ఇంట్లోని సామాగ్రిని సొంతూరుకు తీసుకురావాలని అనుకున్నాం."

-రాజు, రిక్షావాలా

రాజుకు ఐదుగురు సంతానం. దారి మధ్యలో అతడి ఫోన్ స్విచ్ ఆఫ్​ అయిపోయింది. కుటుంబంతో మాట్లాడే వీలు లేకుండా పోయింది. "ఫోన్​ కలవకపోయేసరికి మా కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. దారి మధ్యలో నాకు ఏమైనా అయిందేమోనని భయపడ్డారు. కానీ ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు అందరూ ఆనందంగా ఉన్నారు" అని చెప్పాడు రాజు.

ఇలా 8 రోజులపాటు సాగిన యాత్రను గుర్తుచేసుకుంటూ... ఇల్లు చేరినందుకు సంతోషిస్తూనే భవిష్యత్​పై బెంగతో గడుపుతున్నారు ఆ 11 మంది రిక్షావాలాలు.

Last Updated : May 27, 2020, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details