అది 1918 సంవత్సరం. అప్పుడాయన వయసు నాలుగేళ్లు, స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడని సమాచారం. ఇప్పుడాయన వయస్సు 106 సంవత్సరాలు. మళ్లీ 102 ఏళ్ల తర్వాత కరోనా రూపంలో మరో మహమ్మారిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితేనేం, ఏ మాత్రం భయపడలేదు. ఆయన మనోనిబ్బరం ముందు కరోనా కూడా ఓటమిపాలైంది.
దిల్లీ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కరోనా వైరస్ సోకింది. వారందరినీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్)లో ఉంచి చికిత్స చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబంలో 106 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంత పెద్ద వయస్సులోనూ ఆ వృద్ధుడు తన 70 ఏళ్ల కుమారుడి కన్నా వేగంగా కరోనా బారి నుంచి కోలుకోవడం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 1918-19 మధ్య స్పానిష్ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.