ఒళ్లంతా ముక్కలైనట్లుండే వింత వ్యాధితో ఆపసోపాలు పడుతున్నాడు ఒడిశా గుంజమ్ జిల్లాకు చెందిన పదేళ్ల జగన్నాథ్.
జగన్నాథ్ తండ్రి ప్రభాకర్ ప్రధాన్.. తల్లి సుష్మా. స్వస్థలం సెర్గఢ్లోని గోఠాగావ్లో ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు జగన్ కన్నా ముందే నలుగురు కొడుకులు, ఒక కూతురు పుట్టి వింత వ్యాధి సోకి మరణించారు. ఆరో సంతానంగా జగన్నాథ్ పుట్టాడు. ఏమైందో తెలియదు, జగన్ కూడా అదే మహమ్మారి వ్యాధితో జన్మించాడు.
ఇప్పుడు జగన్నాథ్‌కు 10 ఏళ్లు.. పుట్టినప్పటి నుంచి బెర్హంపుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఫలితం లేదు. ఇతర అధునాతన ఆసుపత్రుల్లో వైద్యం చేయిద్దామంటే చిల్లి గవ్వ లేకుండాపోయింది. ఇప్పటికే జగన్ చికిత్స కోసం స్థోమతకు మించి రూ.7 లక్షలు అప్పు చేశాడు ప్రభాకర్.
నరకయాతన..
శరీరమంతా పగుళ్లతో బీడువారిపోయింది.. భరించలేని మంట, దురదలతో నిత్యం బాధపడుతుంటాడు జగన్. నొప్పి తీవ్రమైతే.. నీటి గోళంలో కూర్చుంటాడు. ఇక ఎండాకాలంలో జగన్ పడే అవస్థలు వర్ణానాతీతం.
కడుపున పుట్టిన కొడుకు.. కళ్ల ముందే నొప్పితో తల్లడిల్లుతుంటే తల్లిదండ్రుల ప్రాణం తరక్కుమంటుంది. ఏళ్లుగా జగన్ బాధను చూసి ఏడ్చి, ఏడ్చి ఇప్పుడు ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. కానీ, ఇప్పటికీ వారికి పరిష్కారం దొరకడంలేదు.