తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు - corona latest news

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జులై చివరినాటికి 10 లక్షలకుపైగా కేసులు నమోదవ్వొచ్చని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఒక్క దిల్లీలోనే 5.50 లక్షలు వెలుగుచూడొచ్చని తెలిపారు. అయితే.. ప్రస్తుతం సామాజిక సంక్రమణ లేదని కేంద్రం పేర్కొంది.

10 lakh corona cases by the end of July in India
జులై ఆఖరుకు 10 లక్షల కేసులు

By

Published : Jun 10, 2020, 6:30 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య జులై చివరినాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో మహమ్మారి మున్ముందు మరింతగా విజృంభించే ముప్పుందని పేర్కొన్నారు. అక్కడ జులై చివరికల్లా 5.5 లక్షల కేసులు వెలుగుచూడొచ్చని అంచనా వేశారు. 'దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఇంకా పెరగనుంది. అందుకే దిల్లీలో జులై ఆఖరుకు 5.50 లక్షల కేసులు ఉండొచ్చన్న విషయం ఆశ్చర్యపరచడం లేదు. అక్కడి జనాభాను, ఇప్పటికే దాదాపుగా 30 వేల కేసులు నమోదవడాన్నిబట్టి చూస్తే సామాజిక సంక్రమణం ఎప్పుడో మొదలైనట్లే. ఇక దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వచ్చే నెల చివరికల్లా 8-10 లక్షలకు పెరగొచ్చు' అని శివనాడార్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సమిత్‌ భట్టాచార్య చెప్పారు. అంతకుముందు మనీశ్‌ శిసోడియా విలేకర్లతో మాట్లాడుతూ.. దిల్లీలో జులై 31కల్లా కేసుల సంఖ్య 5.50 లక్షలకు చేరుతుందని, 80 వేల పడకలు అవసరమవుతాయని అంచనా వేశారు. 'సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించినా దిల్లీలో కరోనా వ్యాప్తి పెరిగింది. అందులోనూ చాలా కేసుల్లో సంక్రమణ మూలం కూడా తెలియడం లేదు' అని కోల్‌కతాకు చెందిన సీఎస్‌ఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్త ఉపాసన రే పేర్కొన్నారు.

సామాజిక సంక్రమణం లేదన్న కేంద్రం

దేశరాజధానిలో రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక సంక్రమణం ఏమైనా ప్రారంభమైందా? అని చర్చించడానికి దిల్లీ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో శిసోడియా, దిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ పాల్గొన్నారు. దిల్లీలో సామాజిక సంక్రమణం ఇంకా ప్రారంభం కాలేదని ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు పేర్కొన్నట్లు శిసోడియా వెల్లడించారు. దేశ రాజధానిలో తాజాగా నమోదైన కేసులకు సగానికి మించి వైరస్‌ సంక్రమణం మూలం కనుక్కోవడం (కాంటాక్ట్‌ ట్రేసింగ్‌) సాధ్యం కావడం లేదని, దీన్ని బట్టి చూస్తే సామాజిక సంక్రమణం మొదలైనట్లు అర్థమవుతోందని సత్యేంద్ర జైన్‌ అన్నారు. అయితే దీనిపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనన్నారు.

ఇదీ చూడండి: 'మహా'పై కరోనా పంజా.. 24 గంటల్లో 120మంది మృతి

ABOUT THE AUTHOR

...view details