రైళ్లలో జరుగుతున్న దొంగతనాలపై గత పదేళ్లలో లక్షా 71వేల ఫిర్యాదులు నమోదయ్యాయని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. భారతీయ రైల్వేల్లో భద్రత ఎంత తీసికట్టుగా ఉందో ఈ విషయం స్పష్టం చేస్తోంది.
2009 నుంచి 2018 మధ్య ప్రయాణికులు.. 1.71లక్షల ఫిర్యాదులను రైల్వే శాఖకు చేశారు. 2018లోనే అత్యధికంగా 36వేల 584 కేసులు నమోదవ్వడం గమనార్హం. మరోవైపు గత నాలుగేళ్లలో రైళ్లలో బలవంతంగా డబ్బు వసూలు చేస్తోన్న 73వేల 837 మంది ట్రాన్స్జెండర్లను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
ఐదు రెట్లు పెరిగాయి...
2009తో పోల్చుకుంటే 2018 నాటికి రైల్వేల్లో దొంగతనాలు ఐదు రెట్లు పెరిగినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.