దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సంవత్సరానికి దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
నాగ్‌పుర్‌లో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సావ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. రోడ్డు వారోత్సవాలు జనవరి 17న ముగియనున్నాయి.
"దేశంలో ప్రతి ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి కారణంగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది గాయాలపాలవుతున్నారు. ఫలితంగా జీడీపీ 2 శాతం ప్రభావితమవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 62 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లే."
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి, రోడ్డు రవాణా, రహదారులశాఖ