Bharat Jodo Nyay Yatra : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్' యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో సుమారు 4వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్, ఈసారి మణిపుర్ నుంచి ముంబయి వరకు సుమారు 6 వేల 713 కిలోమీటర్లు యాత్ర చేపట్టారు. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక న్యాయం వంటి అనేకాంశాలను ఈ యాత్రద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది కాంగ్రెస్. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు చేపట్టిన 'భారత్ జోడో' యాత్ర మాదిరిగానే ఇదికూడా ప్రయోజనం కలిగిస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశపెట్టుకున్నాయి.
'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు రాహుల్ శ్రీకారం
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్' యాత్రను ప్రారంభించారు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అల్లర్లు చెలరేగిన మణిపుర్ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్.
By PTI
Published : Jan 14, 2024, 3:45 PM IST
|Updated : Jan 14, 2024, 3:55 PM IST
మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్ సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సు, కాలినడకన కొనసాగనుంది. మొత్తం 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6 వేల 713 కిలోమీటర్లు సాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. యాత్రలో ఎక్కువ భాగం (1,074 కి.మీ.) ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 11 రోజులపాటు జరగనుంది.
యాత్ర ఎందుకంటే?
పార్లమెంటులో ప్రజా సంబంధిత అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం అవకాశమివ్వకపోవడం వల్ల నేరుగా ప్రజల్లోకి వెళ్లి వివరించడానికి ఈ యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది సైద్ధాంతిక యాత్రే గానీ ఎన్నికల కోసం ఉద్దేశించినది కాదని చెబుతున్నా, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఉత్తరాదిలో ఎదురైన ఓటమి నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకే దీనిని చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పదేళ్ల 'అన్యాయ కాలం'పై గళమెత్తడానికంటూ 'న్యాయ గీతం'ను పార్టీ విడుదల చేసింది. 'భరించకండి, భయపడకండి'(సహో మత్, డరో మత్) అనే అర్థంతో అది కొనసాగుతుంది. వీలైనచోట యాత్రలో చేరాలని ఇండియా కూటమి పక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిరోజూ రెండువిడతలుగా పౌరసమాజ ప్రతినిధులతో, సంఘాలతో రాహుల్ భేటీ కానున్నారు.