తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ జోడో న్యాయ్​ యాత్రకు మణిపుర్ సర్కార్ షరతులు - భారత్ న్యాయ్ యాత్ర రాహుల్

Bharat Jodo Nyay Yatra : ఈనెల 14న మణిపుర్‌లో ప్రారంభమయ్యే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై రాజకీయ వివాదం నెలకొంది. యాత్ర ప్రారంభ వేదికకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలుత అనుమతి నిరాకరించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించగా సాయంత్రానికి మణిపుర్ సర్కార్ తన వైఖరి మార్చుకుంది. పరిమిత సంఖ్యలో జనంతో యాత్ర ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.

Bharat Jodo Nyay Yatra
Bharat Jodo Nyay Yatra

By PTI

Published : Jan 10, 2024, 2:48 PM IST

Updated : Jan 10, 2024, 6:45 PM IST

Bharat Jodo Nyay Yatra :కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టనున్న భారత్​ జోడో న్యాయ్​ యాత్రపై రాజకీయ వివాదం నెలకొంది. జనవరి 14న మణిపుర్​లో ప్రారంభమయ్యే యాత్ర వేదిక కోసం ప్యాలెస్​ మైదానంలో సభ నిర్వహణకు తొలుత అనుమతి నిరాకరించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, కాంగ్రెస్​ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కాస్త మెత్తబడింది. పరిమిత సంఖ్యలో ప్రజలతో యాత్రను ప్రారంభించవచ్చని స్పష్టం చేసింది.

"శాంతిభద్రతల సమస్య రాకుండా చూసేందుకు జనవరి 14న పరిమిత సంఖ్యలో ప్రజలతో యాత్రను ప్రారంభించేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వీలుగా యాత్రలో ఎంత మంది పాల్గొంటారు, వారి పేర్లు ఏంటి అనే వివరాలను మాకు సమర్పించాలి. తూర్పు ఇంఫాల్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది" అని ఆ జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

'మణిపుర్​ నుంచే భారత్ జోడో న్యాయ్​ యాత్ర'
అంతకుముందు, అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ మండిపడింది. మణిపుర్​​ నుంచి భారత్ జోడో న్యాయ్​ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇంఫాల్​లోని మరో ప్రదేశం నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మణిపుర్​ ప్రభుత్వానికి అనుమతి కోరిందని చెప్పారు. 'ఇంఫాల్‌లోని ప్యాలెస్ గ్రౌండ్‌లో యాత్రను నిర్వహించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర తూర్పు నుంచి పశ్చిమానికి చేయాలనుకున్నాం. ఈ యాత్ర ప్రారంభ స్థలాన్ని ఎలా మార్చుకోగలం? మణిపుర్​లోని మరో ప్రదేశం నుంచే యాత్రను ప్రారంభిస్తాం. భారత్ జోడో న్యాయ్ యాత్ర రాజకీయ యాత్ర కాదు. మణిపుర్​లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వానికి సహకరిస్తాం. త్వరలోనే యాత్ర గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తాం.' అని కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత్​ జోడో న్యాయ్​ యాత్రకు సంబంధించిన మ్యాప్​, కరపత్రాలను కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్​ బుధవారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.

"మా బృందం ముఖ్యమంత్రి బీరెన్​ సింగ్​ను కలిసింది. ఇంఫాల్​ తూర్పు జిల్లాలోని హట్టా కాంగెజిబుంగ్​ వద్ద భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ వేదిక కోసం అనుమతి ఇవ్వాలని కోరాం. కానీ ముఖ్యమంత్రి అందుకు నిరాకరించారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజల హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది."

--కైశంమెగాచంద్ర, మణిపుర్‌ పీసీసీ అధ్యక్షుడు

'యాత్రను విజయవంతం చేయాలి'
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపుర్​లో ప్రారంభమై ముంబయి వరకు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆల్కా లాంబా తెలిపారు.' భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలో కొనసాగుతుంది. ఈ యాత్రను విజయవంతం చేయాలి. లోక్​సభ ఎన్నికలు దగ్గర పడ్డాయి. పదేళ్లుగా అన్యాయానికి గురవుతున్న మహిళలందరినీ గెలిపించాలి' అని దిల్లీలో పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఆల్కా లాంబా ప్రసంగించారు.

14 రాష్ట్రాల్లో జరగనున్న యాత్ర
జనవరి 14న మణిపుర్​ నుంచి భారత్ జోడో న్యాయ్​ యాత్ర మొదలై అసోం, మేఘాలయ, బంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. మొత్తం 6,713 కిలోమీటర్ల మేర భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ యాత్ర 66 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

Last Updated : Jan 10, 2024, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details