Bharat Gaurav Tourist Train: ఈ వేసవిలో హాలిడే ప్లాన్ చేస్తున్నారా? దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసమే ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందుకోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న ఈ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వివరించారు.
South Central Railway Special Offers: మార్చి 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12గంటలకు బయల్దేరే ఈ ప్రత్యేక రైలు 8 రోజుల పాటు పూరీ, కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మీదుగా ప్రయాణించి తిరిగి 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే ఏప్రిల్ 18న బయల్దేరే రెండో రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి ఆయా దర్శనీయ ప్రాంతాలను చుట్టేసి ఏప్రిల్ 25న రాత్రి 11 గంటలకు తిరిగి సికింద్రాబాద్ వస్తుంది.
సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే రైలు పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా తిరిగి సికింద్రాబాద్ వస్తుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో రైలు ఆగుతుంది. ఈ పుణ్యక్షేత్ర యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసి-కాశీ విశ్వనాథ్ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయాలు, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, హనుమాన్ మందిరం, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, శంకర విమాన మండపం దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి.
Bharat Gaurav Train Fares: 700 సీట్లు కలిగిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలులో యాత్రకు 3 వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఎకానమీ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.15వేల 300లు, డబల్ లేదా ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13వేల 955 రూపాయలుగా నిర్ణయించారు. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13 వేల 60 వసూలు చేస్తారు. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.24వేల 85, డబల్ లేదా ట్రిపుల్ షేరింగ్‌కు రూ.22వేల 510 ఛార్జ్ చేస్తారు. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.21వేల 460 వసూలు చేస్తారు.