Bharat Drone Shakti 2023 Exhibition : స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం 21 వేల 935 కోట్లతో 56 సీ-295రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అందులో భాగంగా తయారైన తొలి విమానం ఇప్పుడు భారత వైమానిక దళంలో చేరింది. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో అధికారికంగా భారత వాయుసేనలోకి దీన్ని ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హ్యాంగర్ వద్ద సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.
ఒప్పందంలో భాగంగా 2025 నాటికి.. ఫ్లై అవే కండీషన్‌లో ఉన్న 16 విమానాలను ఎయిర్ బస్ డెలివరీ చేయనుంది. మిగిలిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లో జరుగుతుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైంది. గతేడాది అక్టోబరులో వడోదరలో సీ-295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ కన్సార్టియం ద్వారా తయారయ్యే మొదటి సైనిక విమానం ఇది. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందట అవ్రో-748 విమానాలను ప్రవేశపెట్టారు. వాటిని సీ-295విమానాలతో భర్తీ చేయనున్నారు.
5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు. ఈ విమానం ప్రత్యేక మిషన్లతోపాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించగలదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సివిల్లెలో ఈ విమానం నడిపేందుకు శిక్షణ పూర్తి చేసుకున్నారు.