కొవిడ్-19ను నిరోధించేందుకు ముక్కుద్వారా తీసుకునే (ఇంట్రానాజిల్) టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. దీన్ని బూస్టర్ డోసుగా ఇచ్చేందుకుగాను తుదిదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు తాజాగా దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకా ఎంతో తేలికగా ఉంటుందని భారత్ బయోటెక్ తన దరఖాస్తులో పేర్కొంది.
కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న వేళ బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇటు భారత్‌లోనూ ఇదేవిధమైన డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బూస్టర్ డోసుపై కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా బూస్టర్ డోసుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతోన్న వ్యాక్సిన్ నిపుణుల కమిటీ.. మూడోదశ ప్రయోగాల సమాచారం లేకుండా వీటికి అనుమతి ఇవ్వవద్దనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో బూస్టర్ డోసు ప్రయోగాలకు ఆయా వ్యాక్సిన్ తయారీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.