Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఒమిక్రాన్ రకం వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే. ఈ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు మించిన వయసు వారికి ఇస్తున్నారు. దీన్ని పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కొంతకాలం కిందట భారత బయోటెక్, డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దాంతో పాటు పిల్లలపై నిర్వహించిన క్లినికల్ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను అందజేసింది. ఈ సమాచారాన్ని డీసీజీఐకి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) కొద్దికాలం కిందట పరిశీలించి సానుకూలత వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై డీసీజీఐ తుది నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇవ్వటానికి అనుమతి మంజూరు చేస్తున్నట్లు డీసీజీఐ వెల్లడించింది. దీంతో ఈ వయసు పిల్లలకు మరొక టీకా అందుబాటులోకి వచ్చినట్లవుతోంది.
Vaccine for Children in India:
పెద్దల మాదిరిగానే, పిల్లలకు సైతం కొవాగ్జిన్ టీకాను రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోసు తర్వాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాలి. ఈ టీకాతో కొవిడ్ నుంచి పిల్లలకు రక్షణ లభిస్తుందని క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, భారత ఔషధ నియంత్రణ మండలికి కృతజ్ఞతలు తెలియజేసింది.
ఆగస్టులోనే జైడస్ క్యాడిలాకు అనుమతి
జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్-డి టీకాను 12 ఏళ్ల వయసు దాటిన వారికి ఇవ్వటానికి ఈ ఏడాది ఆగస్టులో అత్యవసర అనుమతి లభించిన విషయం విదితమే. ఈ టీకా దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. పిల్లలకు ఇచ్చేందుకు కొవిడ్ టీకాను తాము కూడా త్వరలో ఆవిష్కరించనున్నామని ఇటీవల సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అధర్ పూనావాలా వెల్లడించిన విషయం తెలిసిందే. నొవావ్యాక్స్ అనే యూఎస్ సంస్థ ఆవిష్కరించిన ‘కొవావ్యాక్స్’ టీకాను 3 ఏళ్లకు మించిన వారిలో వినియోగించటానికి వీలుగా సీరం మనదేశంలో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది.
ఇతర దేశాల్లో ఇలా..
పిల్లల కోసం కొవిడ్ టీకా అమెరికాలో కొంతకాలం కిందటే అందుబాటులోకి వచ్చింది. ఫైజర్- బయాన్‌టెక్ ఆవిష్కరించిన టీకాను యూఎస్‌లో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వేస్తున్నారు. కెనడా, యూకేల్లో సైతం పిల్లలకు టీకాలు ఇస్తున్నారు. మనదేశంలో టీకాల లభ్యత పెరగటానికి తోడు, వినియోగానికి సైతం తాజాగా అనుమతులు లభిస్తున్నాయి. ఈక్రమంలో ఇకపై విస్తృత స్థాయిలో పిల్లలకు కొవిడ్ టీకాలు లభించే అవకాశం కనిపిస్తోంది.