Agnipath Protest: త్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా కూడా మారాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం.. భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
Bharat Bandh: భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠినంగా వ్యవహరించాలని సీనియర్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు మొబైల్, కెమెరా, సీసీటీవీల ద్వారా హింసకు పాల్పడే వారిపై డిజిటల్ ఆధారాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
వందల రైళ్లు రద్దు.. భారత్ బంద్ కారణంగా దేశంలో.. సికింద్రాబాద్ తరహా ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 181 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లతోపాటు 348 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. నాలుగు మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా నిలిపివేశారు. కాగా, భారత్ బంద్ నేపథ్యంలో మొత్తం 539 రైళ్లు ప్రభావితమయ్యాయి.
పంజాబ్‌లో పోలీసులు అప్రమత్తం..భారత్ బంద్ పిలుపుతో అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ అధికారులు.. పోలీసులను ఆదేశించారు. దీంతో పాటు పంజాబ్‌లోని అన్ని ప్రధాన సైనిక కోచింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
హరియాణాలో భద్రత కట్టుదిట్టం.. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హరియాణాలో కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఫరీదాబాద్‌లో రెండు వేలకు పైగా పోలీసులను మెహరించారు.
ఝార్ఖండ్‌లో పాఠశాలలు మూసివేత.. సోమవారం భారత్ బంద్ దృష్ట్యా ఝార్ఖండ్‌లో అన్ని పాఠశాలలను మూసివేశారు అధికారులు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మూసివేసిన్నట్లు ఝార్ఖండ్ విద్యాశాఖ అధికారి తెలిపారు.