కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం సంపూర్ణంగా, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించింది. మొత్తం 25కుపైగా రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాదుల సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి.
ఆందోళనలకు కేంద్రబిందువుగా ఉన్న పంజాబ్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు, టోల్‌ప్లాజాలు మూతపడ్డాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రోడ్లపై బైఠాయించి శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు.
ఒడిశాలో బంద్ ప్రభావం కనిపించింది. ఆందోళనకారులు రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కాంగ్రెస్ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించాయి. భువనేశ్వర్‌లో ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. రైలు పట్టాలపై బైఠాయించిన కార్మిక సంఘాల ప్రతినిధులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
- బిహార్‌లో బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. పట్నా, ముజఫర్‌పుర్ సహా పలు ప్రాంతాల్లో ఆర్జేడీ, వామపక్షాల కార్యకర్తలు రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. దర్బంగాలో రైతు సంఘాల సభ్యులు రోడ్లపై టైర్లు కాల్చారు.
- ఝార్ఘండ్‌లో వామపక్ష శ్రేణులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి. రైతులకు అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
- తమిళనాడులో చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో వామపక్ష శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఒనగూరేదేమీ లేదని ఆరోపించాయి.
- పుదుచ్చేరిలో కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. రైతులకు ప్రయోజనం కల్పించని చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
- రాజస్థాన్ జైపుర్‌లో భారత్ బంద్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని.. ఇరువర్గాలను శాంతింపజేశారు.
కర్ణాటకలో బంద్ పాక్షికంగా జరిగింది. బెంగళూరు, మైసూరు, హుబ్లీ తదితర నగరాల్లో కాంగ్రెస్‌తో పాటు రైతు, కార్మిక సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. నల్లజెండాలు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో వినూత్న నిరసన
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు వినూత్నంగా నిరసన తెలిపాయి.
దిల్లీలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా.. 4 గంటల పాటు రైతులు బంద్ నిర్వహించారు. అన్నదాతల ఆందోళనకు సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. బంద్ తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.