వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా(farm laws protest) దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్'(bharat bandh news) ప్రశాంతంగా సాగుతోంది. దిల్లీ, పంజాబ్, హరియాణాలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది(bharat bandh today). ఇటు తమిళనాడు, కేరళలోనూ రైతన్నలకు మద్దతుగా నిరసనలు చేపట్టారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై మద్దతు తెలిపి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తర భారతం..
బంద్ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా దిల్లీలో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంద్ కారణంగా దేశ రాజధాని (delhi bharat bandh news) భద్రతా వలయంలోకి జారుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిల్లీ- గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తెల్లవారుజాము 4గంటల నుంచే.. రహదారులపైకి చేరిన అన్నదాతలు కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పారు. దిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపుర్ లోనూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొత్త సాగు చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతమైన షంభూ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న రైతులు.. అక్కడి జాతీయ రహదారిని దిగ్భందించారు. వాహనాలు వెళ్లేందుకు అన్నదాతలు అనుమతించటకపోవడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హరియాణా రోహ్‌తక్, కర్నాల్ ప్రాంతాల్లోనూ నిరసనకు చేపట్టిన రైతన్నలు.. రహదారిపై ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను అడ్డుకున్నారు. అటు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతన్నలు ఆందోళనకు దిగారు.
మరోవైపు రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి తమ నిరసనలు తెలిపారు. దీంతో దిల్లీ, అమృతసర్, అంబాలా, ఫిరోజ్‌పుర్ డివిజన్లలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ఆయా ప్రాంతాలు మారుమోగిపోయాయి. మొత్తం మీద ఇప్పటివరకు 25రైళ్లపై బంద్ ప్రభావం పడినట్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ..
రైతులు చేపట్టిన భారత్ బంద్.. తమిళనాడులో(tamil nadu bharat bandh) ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో నిరసనకు దిగిన ఆందోళనకారులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నంలో పోలీసులు- నిరనసకారుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.