Bhangra Dance On Skates : కొందరు ప్రతి విషయంలో కొత్తదనం కోరుకుంటారు. అందులో భాగంగా తాము చేసే పనిని రోటీన్‌కు భిన్నంగా చేస్తుంటారు. ఆ కోవకే చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి.. రికార్డులు కొల్లగొడుతోంది. పంజాబీ సంప్రదాయ నృత్యమైన భాంగ్రాను.. స్కేట్స్ వేసుకుని మరీ వినూత్నంగా చేసి అబ్బురపరుస్తోంది. ఆటలో సంప్రదాయాన్ని మిళితం చేసి 'స్కేటింగ్ భాంగ్రా' ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. అలా 'భాంగ్రా గర్ల్ ఆన్ స్కేట్స్'గా గుర్తింపు పొందింది చండీగఢ్‌కు చెందిన జాన్వీ.
"నాకు చాలా అవార్డులు వచ్చాయి. నేను రాష్ట్ర స్థాయి అవార్డు, మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు, జాతీయ స్థాయి అవార్డు సాధించాను. ఇప్పటివరకు ఫ్రీ స్టైల్ స్కేటింగ్‌లో ప్రపంచ స్థాయిలో ఎవరూ పతకం సాధించలేదు. నేను దాన్ని సాధించాలి. నేను సంప్రదాయ భాంగ్రా డ్యాన్స్‌తో స్కేటింగ్‌ను మిళితం చేసి సరికొత్తగా ప్రదర్శించాను. నాలాగే డ్యాన్స్, రీల్స్, వీడియోలు చేసే యువత కూడా వాటితో సంస్కృతిని మిళితం చేసి వినూత్నంగా ముందుకు రావాలి. అది మిగతా వారికి స్ఫూర్తినిస్తుంది"
--జాన్వీ, స్కేటింగ్ భాంగ్రా డ్యాన్సర్
భాంగ్రా నృత్యానికి ఆకర్షితురాలైన జాన్వీ.. 9 ఏళ్ల వయసు నుంచే సాధన చేయడం మొదలు పెట్టింది. కుమార్తె ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి.. స్కేట్లపై భాంగ్రా ప్రదర్శించమని ప్రోత్సహించాడు. జాన్వీకి కూడా అది కొత్తగా అనిపించడం వల్ల స్కేట్స్‌తో భాంగ్రా చేయడం ప్రారంభించింది. అలా యూట్యూబ్ సహాయంతో కొత్త డ్యాన్స్ మూవ్‌లను నేర్చుకుంది. 2019 నుంచి ప్రదర్శనలను మొదలు పెట్టిన జాన్వీ.. పలు రికార్డులు సైతం సొంతం చేసుకుంది. కాగా భయపడకుండా స్కేటింగ్ చేసేలా జాన్వీకి శిక్షణ ఇచ్చామని ఆమె తండ్రి తెలిపారు.