Bhagwant Singh Mann Daughter Video Viral : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మొదటి భార్య కుమార్తె సీరత్ కౌర్ సంచలన వీడియోను విడుదల చేశారు. భగవంత్ మాన్ మూడోసారి తండ్రి కాబోతున్నారంటూ వీడియోలో చెప్పారు. ఈ విషయం తమకు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందన్నారు. తమ బాధ్యతలే సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి, మరొకరికి న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. నమ్మిన వారిని మోసం చేయొద్దంటూ తండ్రిని కోరారు సీరత్ కౌర్.
"మొదటి నుంచి నా తండ్రి అబద్దాలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ ప్రజలతో కూడా అదే చేస్తున్నారు. నాకు చేసిన అన్యాయమే పంజాబ్ ప్రజలకు చేస్తున్నారు. నాకు ఆయన పేరును కూడా ఆపాదించవద్దు. మా అమ్మతో విడాకులు వేరే కథ. మా అమ్మను ఎమోషనల్‌గా వీక్ చేసినట్లే, ఇప్పుడు పంజాబ్ ప్రజలను చేస్తున్నారు. ఇప్పటికీ విధానసభకు, గురుద్వారా సాహెబ్‌కు కూడా మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?"
-సీరత్ కౌర్, భగవంత్ మాన్ కుమార్తె
'పంజాబ్‌ను ఆ దేవుడే రక్షించాలి'
రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన సీరత్ కౌర్ వీడియోను ఆమె తల్లి, భగవంత్ మాన్ మొదటి భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దేవుడే పంజాబ్ ప్రజలను రక్షించాలంటూ తన మాజీ భర్తపై పరోక్ష విమర్శలు చేశారు.
"నేను ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేయాల్సి వచ్చింది. మేము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాము. కానీ కొన్నిసార్లు నిశబ్దంగా ఉండడం కూడా నేరమే. దీనివల్ల నిజమైన దోషులు బయటపడుతున్నారు. భార్యభర్తలు విడాకులు తీసుకుంటే పిల్లలకు అన్యాయం చేశారని తల్లినే ఎందుకు అంటున్నారు. విడాకులు తీసుకుంటే తండ్రిగా ఎలాంటి బాధ్యతలు ఉండవని ఏ చట్టం చెబుతోంది. పంజాబ్ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టానని చెబుతున్న ఓ కళాకారుడిని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ పంజాబ్ కోసమే కుటుంబాన్ని విడిచిపెట్టిన వ్యక్తి, మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు. పంజాబ్ బాగుపడుతుందంటే మేము చాలా సంతోషిస్తాం. మేము నిశబ్దంగా ఉండేందుకు సిద్ధంగానే ఉన్నాం. దయచేసి ఇకనైనా రోజూ డ్రామాలు వేయడం మానండి."
--మాన్ మొదటి భార్య