Bhagwant Mann Resigns: పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మాన్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖ అందించారు.
రాజీనామాకు ముందు భావోద్వేగానికి గురయ్యారు మాన్. పంజాబ్ ప్రజలు తనకు పెద్ద బాధ్యతను అప్పగించారని వ్యాఖ్యానించారు. "నేను పార్లమెంట్‌కు దూరమవుతున్నాను. పంజాబ్ నాకు పెద్ద బాధ్యతను అప్పగించింది. తమ కుమారుడిగా భావించి.. ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు" అని మాన్ పేర్కొన్నారు.
"కొన్నేళ్లుగా సంగ్రూర్ ప్రజలు.. నాపై చాలా ప్రేమను చూపారు. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పంజాబ్ మొత్తానికి సేవ చేసే అవకాశం వచ్చింది. కొన్నినెలల్లో లోక్‌సభలో పంజాబ్ ప్రజల గొంతు మళ్లీ వినిపిస్తామని సంగ్రూర్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను."
-భగవంత్ మాన్, పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్థి